2017లో ఏపీ రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రమణ్యం, ఆ శాఖ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన ఘటనలో ముగ్గురు తెదేపా నేతలకు విజయవాడ సీపీ ద్వారా నోటీసులు అందచేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్ నాగుల్ మీరాకు నోటీసులు ఇవ్వాలని తెలిపింది. తెదేపా ఎంపీ కేశినేని నానికి గతంలో ఇచ్చిన నోటీసు అన్ క్లెయిమ్ అయినట్లు ఓ న్యాయమూర్తి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.... మిగిలిన ముగ్గురు ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.
పర్మిట్ల విషయంలో రగడ..
ఆంధ్రప్రదేశ్‌లో హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ పర్మిట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని.. వారిని నియంత్రించటంలో రాష్ట్ర రవాణా శాఖ విఫలమైందంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని 2017లో ఆందోళనకు దిగారు. అదే సందర్భంలో ఆయన తన కేశినేని ట్రావెల్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హిమాచల్‌ప్రదేశ్ నుంచి అక్రమ పర్మిట్లతో ఏపీలో యథేచ్ఛగా తిరుగుతున్న బస్సులను ఎందుకు నియంత్రించటం లేదంటూ రవాణా కమిషనర్ కార్యాలయం దగ్గర కమిషనర్ బాలసుబ్రమణ్యంపై తెదేపా నేతలు దురుసుగా ప్రవర్తించారు. అప్పట్లో ఆ విషయం సంచలనంగా మారినందున ముఖ్యమంత్రి చంద్రబాబు... తెదేపా నేతలను పిలిచి మందలించారు. బాలసుబ్రమణ్యంకు వారితో క్షమాపణ చెప్పించారు. అప్పట్లో వివాదం సద్దుమణగగా ఇప్పుడు కోర్టు నోటీసులు జారీ చేయటంతో.. ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.