ఎన్నో ఏళ్లుగా అనేక నేరాలకు పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 54 లక్షల 60 వేల విలువైన 1258 గ్రాముల బంగారు ఆభరణాలు, 17.2 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు 9లక్షల 65 వేల నగదు, ల్యాప్ టాప్, రెండు కార్లు స్వాధీనపరచుకున్నామని విజయవాడ సీపీ ద్వారకాతిరుమలరావు తెలిపారు.
తన చేతిని తానే నరుక్కున్నాడు
ఆరుగురు సభ్యులు కలిసి ఓ ముఠాగా ఏర్పడి ఎన్నో ఏళ్లుగా ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారిలో ముఠా నాయకుడైన ప్రధాన నిందితుడు భూక్యా నాగరాజు నాయక్ 2007 నుంచి నేరాలు చేస్తున్నాడు. ఇతనిపై ఇప్పటివరుకు 140 కేసులు ఉన్నాయని సీపీ తెలిపారు. కొన్ని కేసుల్లో శిక్ష అనుభవించి 2017లో విడుదలైన ఇతను అనంతరం ఇంటి వద్ద ఉంటూ దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. అప్పుడే కుటుంబ సభ్యులతో గొడవపడి తన ఎడమ చేతితో కుడి చేయిని నరుక్కున్నాడు. ఒక్క చేయి ఉన్నప్పటికీ దొంగతనాలు మానలేదు. గుంటూరు జిల్లాకి చెందిన పుల్లేటికుర్తి ఉమామహేశ్వరరావు(బుజ్జి)తో కలిసి నేరాలు చేసేవాడు. ఈ రెండో నేరగాడైన బుజ్జి 2002 నుంచి నేరాలు చేస్తున్నాడు. బట్టల దుకాణం పెట్టుకుని జీవితం సాగించే ఇతను.. ప్రవృత్తిగా దొంగతనాలను ఎంచుకున్నాడు. 2007లో జైలులో బుక్యా నాగరాజు నాయక్తో పరిచయమై.. అప్పటినుంచి ఇద్దరు కలిసి దొంగతనాలకు పాల్పడేవారు. ఇతనిపై ఇప్పటివరకు 300 కేసులున్నాయి. ఇక మూడో వ్యక్తి పేరు బాంఢవ రాజు... బుక్యా నాగరాజు ఇతనికి వరసకి మావయ్య. 2015 నుంచి నేరాలు చేస్తున్నాడు. అయినప్పటికీ ఇప్పటివరకూ ఇతనిపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని సీపీ తెలిపారు.
మైనర్ ఒకరు... ఇంజనీరింగ్ విద్యార్థి మరొకరు
నిందితుల్లో నాలుగో వ్యక్తి మైనర్. ఇతనికి నాగరాజ్ నాయక్ బాబాయి వరస. అతనితో కలిసి దొంగతనాలకు పాల్పడేవాడు. బృందంలోని మరో ఇద్దరు వేరే కేసులో ప్రస్తుతం విశాఖ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో గుత్తికొండ పవన్ అనే అతను ఇంజనీరింగ్ పూర్తి చేసి దొంగతనాలు చేస్తున్నాడు అని సీపీ వివరించారు. ఇప్పటి వరకు వీరు చోరీ చేసింది 63 లక్షలు కాగా... 55 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు.