ఏళ్లుగా క్రిష్ణానదే వారి ఆవాసం. నదిమా తల్లి ఒడిలోనే.. గుడారంలో నివాసం. ఏమాత్రం నీటిమట్టం పెరిగినా.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తాల్సిందే. ఒకసారి అలాగే.. వరదల్లో రేషన్ కార్డు కొట్టుకుపోయి.. ప్రభుత్వ సాయం నోటి నుంచి లాగేసినట్లయింది. ఈ ఇక్కట్లు చాలవన్నట్లు.. చిన్నప్పుడే 2 కాళ్లనూ.. పోలియో కాటేసింది. నిత్యం 60 అడుగుల ఎత్తు ఎక్కితే గానీ పూట గడవదు.
10 కాదు 20 కాదు.. సుమారు 60 అడుగుల ఎత్తున్న కొండరాళ్ల కట్ట. ఈ దూరం దాటితే.. రద్దీగా ఉండే రహదారిపై బిక్కుబిక్కుంటూ నడవాలి. అందరికీ ఇవి పెద్ద సమస్యలు కాకపోవచ్చు కానీ.. ఆ కష్టాలు శ్రీనుకు స్వీయానుభవం. పదేళ్లుగా ఇదే పరిస్థితి. శరీరం సహకరించక యాచనే ఆధారంగా మారింది. కనీసం తాగునీటికి వెళ్లాలన్నా కొండరాళ్ల కట్ట ఎక్కాలి.
వరదలో కొట్టుకుపోయిన రేషన్ కార్డ్
కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డకు చెందిన శ్రీను... తల్లితో కలిసి అక్విడక్ట్ వద్ద కృష్ణానదిలో గుడారం వేసుకుని జీవనం సాగిస్తున్నాడు. శ్రీను అన్న కుమారుడూ వీరితోనే ఉంటున్నాడు. 2006లో వరదల్లో రేషన్, ఆధార్ కార్డులు కొట్టుకుపోయి... చౌక దుకాణాలిచ్చే సరకులు ఆగిపోయాయి. 2019లో వరదలకు గుడిసె కూడా కొట్టుకుపోయింది. కూలికెళ్లేందుకు శరీరం సహకరించదు. జీవనాధారం అంటూ ఏమీ లేదు. తల్లికీ వయసు పైబడింది. చేసేదేమీ లేక ఆత్మగౌరవం చంపుకొని యాచించుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇల్లు మంజూరు చేయాలి
ఈ కట్ట ఎక్కే క్రమంలో.... రాళ్లపై జారి పడి గాయాలపాలైన సందర్భాలెన్నో అంటున్నాడు శ్రీను. నిత్యం తాను ఎంతోమంది మధ్య పాకుతున్నా... ఎవరూ పట్టించుకోరని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ప్రభుత్వ పథకాలూ అందని ద్రాక్షగానే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇల్లు మంజూరు చేస్తే కాస్తయినా భరోసా ఉంటుందని వేడుకుంటున్నాడు. కర్రలతో నడవడమే కష్టంగా ఉందంటున్న శ్రీను... 3 చక్రాల బండి ఇప్పించాలని అధికారులను కోరుతున్నాడు.
ఇదీ చదవండి: కాలువలో ఎమ్మెల్యే చెల్లి, బావ, మేనకోడలి మృతదేహాలు