కృష్ణా జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షానికి విజయవాడలో లోతట్టుప్రాంతాలు జలమయం అయ్యాయి. వి.ఎన్.పురం, ముస్తాబాదలో కాలనీల్లోకి వరద నీరు చేరింది. పొలాల్లోని నీటిని తొలగించేందుకు అన్నదాతల అవస్థలు పడుతున్నారు.
- కైకలూరు మండలం ఆటపాక ప్రధాన రహదారికి అడ్డంగా భారీ వృక్షం నేలకొరిగింది. గ్రామంలోని పామర్రు- కత్తిపూడి జాతీయ రహదారిపై చెట్టు కూలడంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామస్థుల సహకారంతో, రోడ్డుకు అడ్డంగా ఉన్న భారీ చెట్టును పక్కకు జరిపి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించిన మండల పోలీసులకు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు.
- విజయవాడ నగరంలోను లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. జనజీవనం పూర్తిగా స్థంభించింది. రహదారిపై మోకాళ్లలోతు నీరు చేరడంతో నగరవాసులు అడుగుబయట పెట్టలేకపోతున్నారు. సింగ్ నగర్, వాంబేకాలనీ, మొగల్రాజపురం, నిర్మల కాన్వెంట్, బెంజ్ సర్కిల్ , బందర్ రోడ్డు రహదారులన్నీ పూర్తిగా నీట మునిగాయి.
- తిరువూరు నియోజకవర్గంలో వాగులు ఉగ్రరూపం దాల్చాయి. కట్లేరు, ఎదుళ్ల, పడమటి, గుర్రపు, తూర్పు, కొండ, అలుగు, విప్లవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. తిరువూరు మండలం ఎరుకోపాడులో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లమీద ప్రవహిస్తూ, ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి, దీనిపై సంబంధిత అధికారులు, చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్థులు కోరుతున్నారు.
- మైలవరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మండలంలో రాత్రి నుంచి ఇప్పటి వరకు 86.2మి.మి.ల వర్షపాతం నమోదైంది. వర్షానికి పట్టణంలో రోడ్లన్ని జలమయమయ్యాయి. డ్రైనేజీలోని నీరు రోడ్లపై ప్రవహిస్తుంది. ప్రధాన రహదారులపై మోకాలు లోతు పైగా వరద నీరు చేరింది. వర్షం ప్రభావానికి బయటకు రావాలంటేనే అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది.
- గన్నవరం మండలం కొండపావులూరు వద్ద విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి నిర్మాణంలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. పైవంతెన నిర్మాణ సామగ్రి మీదపడి ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి.
- భారీ వర్షానికి రోడ్లు మునిగి ఇళ్లలోకి నీరు చేరడంతో గన్నవరం మండలం సూరంపల్లిలో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని నిరసన చేపట్టారు. వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి అని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. దీర్ఘకాలిక సమస్య పరిష్కారంలో పంచాయతీ అధికారులు జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారికి అడ్డంగా బారికేడ్లు పెట్టి గ్రామస్థులు నిరసన చేపట్టారు
ఇదీ చదవండీ.. GULAB EFFECT: కూలిన గోడలు.. విరిగిపడిన కొండచరియలు.. మహిళ మృతి