రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అన్ని వర్గాల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు స్వీకరించింది. రైతుల ఎంపికపై తమ దృష్టికి వచ్చిన అభిప్రాయాలను ప్రజాప్రతినిధులు నివేదించారు. బుధవారం కలెక్టర్ల సమావేశంలో వారి నుంచి సూచనలు తీసుకున్నారు.
సీఎం హామీ ప్రకారం రైతు భరోసా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. అలాకాకుండా కృష్ణా, ఉభయగోదావరి, రాయలసీమ జిల్లాల్లోని ప్రధాన సామాజిక వర్గాల్లోని పేదరైతులకూ వర్తింపజేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. పదెకరాలున్న భూ యజమాని తన పొలాన్ని ఎంతమందికి కౌలుకిచ్చినా ఒకరికే రైతు భరోసా వస్తుంది. ఒక రైతు తనకు తెలిసిన పది మందిని కౌలు రైతులుగా చూపించి పత్రాలు తీసుకుంటే పథకం పక్కదారి పడుతుందనే ఆలోచనతో ఈ విధానాన్ని ప్రతిపాదించారు. ఒక ఇంట్లో నలుగురైదుగురికి భూములున్నా కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుంటారు. కనిష్ఠంగా మెట్టభూమి రెండెకరాలు, మాగాణి ఎకరం ఉండాలని మార్గదర్శకాల్లో పొందుపరుస్తున్నారు. వరికి అర ఎకరాగా నిర్ణయించాలని కలెక్టర్లు సూచించారు. అన్ని ప్రతిపాదలను ప్రజాప్రతినిధులు క్రోడీకరించి ముఖ్యమంత్రి జగన్ ముందు ఉంచనున్నారు. జగన్ నిర్ణయం ప్రకారం మార్గదర్శకాలు జారీ చేసి గ్రామాల్లో రైతుల వివరాలను పరిశీలిస్తారు..