ఒకప్పుడు కృష్ణ జిల్లా రాజకీయాలను శాసించిన కుటుంబం అది. ప్రత్యర్థులకు ఓటమి భయాన్ని ముందే చూపిన వ్యూహాలు ఆయనవి. కృష్ణ రాజకీయాలకు కొత్త కోణం చూపిన...దేవినేని నెహ్రూ... తనయుడు దేవినేని అవినాష్ గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారనే ప్రచారం ఆసక్తి రేపుతోంది. ఈ కుర్రాడి పోటీతో ఇక్కడి రాజకీయం కొత్త మలుపు తీసుకుంది. విజయం సాధించేది ఎవరు అనే ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ముందే గుడివాడ రాజకీయం వేడెక్కింది.
ఆవిర్భావం నుంచేకంచుకోట..
తెదేపా ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో 2సార్లు మినహా అన్నిసార్లు విజయ పతాకం ఎగరవేసింది. 1989లో కాంగ్రెస్ నుంచి కఠారి ఈశ్వర్‌కుమార్, 2014లో వైకాపా నుంచి కొడాలి నాని గెలుపొందారు. 2009, 2004లోనూ కొడాలి నాని తెదేపా తరపునే పోటీ చేసి విజయం సాధించారు. 1983, 85 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఈ స్థానం నుంచి విజయం సాధించారు. 1985 ఉపఎన్నికలు, 1994 ఎన్నికల్లో రావి శోభనాద్రి చౌదరి, 1999 ఎన్నికల్లో రావి హరగోపాల్, 2000 ఉపఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు గెలుపొందారు.
గత వైభావన్ని మళ్లీ తీసుకొచ్చి అధినేతకు బహుమతిగా ఇవ్వాలని అవినాష్ అనుకుంటున్నారు. పదిహేనేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యర్థి అసమర్థతే ఆయుధమని అభిప్రాయపడుతున్నారు. సీనియర్ నాయకుల సలహాలు, సూచనలతో గుడివాడలో తెదేపా జెండా ఎగరవేస్తామని ధీమాతో ఉన్నారు.