రాష్ట్రంలోని గ్రామాల్లో ఎల్‌ఈడీ దీపాల వెలుగులు మళ్లీ ప్రకాశించనున్నాయి. దీపాల నిర్వహణ బాధ్యతను తిరిగి పంచాయతీలకు అప్పగిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ జిల్లా పరిషత్ ముఖ్య నిర్వహణ కార్యదర్శి(సీఈవో) ఉత్తర్వలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు(డీపీవో) సమాచారాన్ని పంపారు. పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామ సచివాలయాల్లోని ఎనర్జీ అసిస్టెంట్లు బాధ్యతలు చేపట్టారు.
ఇప్పటి వరకు ఎల్‌ఈడీ దీపాల నిర్వహణ బాధ్యతను ఇంధన సామర్థ్య సేవల సంస్థ(ఈఈఎస్‌ఎల్), పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్) చూసేవి. ఇక నుంచి పాడైన చోట కొత్త ఎల్‌ఈడీలు, ఇతర సామగ్రి కేటాయింపునకే ఆ సంస్థలు పరిమితం కానున్నాయి. కృష్ణా జిల్లాలోని పంచాయతీల్లో మొత్తం 2.45లక్షల ఎల్‌ఈడీ బల్బులు ఉన్నాయి. వీటిలో 76 గ్రామ పంచాయతీల్లో నెడ్‌క్యాప్, 736 పంచాయతీల్లో ఈఈఎస్‌ఎల్, ఎల్‌ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేసి వీటి నిర్వహణ చూస్తున్నాయి.
ఎల్‌ఈడీకి నెలకు రూ.9.50:
ఎల్‌ఈడీల ఏర్పాటుతో ఆదా అయ్యే విద్యుత్తు ఛార్జీల్లో 80 శాతం మొత్తాన్ని ఈఈఎస్‌ఎల్, నెడ్‌క్యాప్‌కు పంచాయతీలు చెల్లించాలన్నది ఒప్పందం. విద్యుత్తు ఆదాపై ఈఈఎస్‌ఎల్, నెడ్‌క్యాప్ సంస్థలకు గ్రామ పంచాయతీలు చెల్లిస్తున్న మొత్తంలో ఎల్‌ఈడీకి నెలకు రూ.9.50 చొప్పున... దాదాపు రూ.23.27లక్షలు పంచాయతీలకు తిరిగి చెల్లించనున్నాయి. ఈ మొత్తంతో పంచాయతీలు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు చూడనున్నాయి. పాడైన ఎల్‌ఈడీ స్థానంలో కొత్తవి సరఫరా చేయడంతో పాటు.. ఇతర ముఖ్యమైన సామగ్రిని ఈఈఎస్‌ఎల్, నెడ్‌క్యాప్‌లు యథావిధిగా కేటాయిస్తాయి.
ఇదీ చదవండి: