కరోనాని నియంత్రించడంలో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం... దాని గురించి మాట్లాడిన వారిపై ఎదురు దాడికి దిగుతోందని, కేసులు పెడతామని బెదిరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ చేతగానితనంతోనే ప్రజలు బలవుతున్నారని, వారికి తమ బాధను వెళ్లగక్కే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షల్ని పూర్తిగా రద్దు చేయడమో, వాయిదా వేయడమో చేయాలని, రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ వేయాలని డిమాండ్ చేశారు. ‘‘ప్రభుత్వ అసమర్థత, కాలయాపనతో ఇప్పటికే చాలా నష్టపోయాం. ఎవరు బతుకుతారో, ఎవరు చనిపోతారో తెలియని భయానక పరిస్థితి నెలకొంది. శ్మశానాలకు లెక్కలేనన్ని శవాలు వస్తున్నాయి. కరోనా కేసులు, మరణాలపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, జరుగుతున్నదానికి పొంతన ఉండటం లేదు. ఇకనైనా కుట్రలు, విధ్వంసాలు ఆపేసి మహమ్మారిపై దృష్టి పెట్టాలి’’ అని చంద్రబాబు బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్పష్టంచేశారు.
కోర్టుని మభ్యపెట్టేందుకే జీవోలు
‘‘కరోనాపై ఈనెల 27న హైకోర్టులో కేసు విచారణకు రావడంతో.. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని 23 నుంచి 26 మధ్య ప్రభుత్వం పలు జీవోలు ఇచ్చింది. వాటిలో ఒక్కటైనా అమలవుతుందేమో చెప్పాలి? ఆరోగ్యశ్రీ కింద కొవిడ్‌కు చికిత్స చేయడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం కిందా కరోనాకు వైద్యమందడం లేదు. ప్రైవేటు ఆసుపత్రులు ర్యాపిడ్ పరీక్షలకు రూ.230, ఆర్టీపీసీఆర్‌కు రూ.496 మాత్రమే వసూలు చేయాలని చెప్పారు. కానీ ఎక్కడా అమలవడం లేదు. ఆర్టీజీఎస్ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యవస్థ. అది ఉంటే ఇప్పుడు ఎంతో ఉపయోగపడేది. అలాంటి మంచి వ్యవస్థలన్నీ వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
అంబులెన్స్‌లూ లేకపోవడం ఎంత ఘోరం?
‘‘రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల పరిస్థితి దారుణంగా ఉంది. మృతదేహాలను తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లూ రావడంలేదు. పలాసలో మహిళ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాల్సి వచ్చింది. మాచర్లకు చెందిన వెంకట్రావమ్మ అనే మహిళను బెడ్ దొరక్క గుంటూరుకి, అక్కడి నుంచి విజయవాడకు తిప్పారు. విశాఖలో 15 నెలల పసిపాప చనిపోయింది. 3గంటల్లో బెడ్ ఇస్తామంటున్నారు. ఎక్కడిచ్చారు? మహాప్రస్థానం వాహనాల్ని ఈ ప్రభుత్వం ఎందుకు తొలగించింది? అవి ఉంటే మృతదేహాల్ని తీసుకెళ్లేందుకైనా ఉపయోగపడేవి కదా? కరోనా పరీక్షల ఫలితాలు 24 గంటల్లో ఇస్తున్నామని ప్రభుత్వం కోర్టుకి చెప్పింది. కానీ 5-7 రోజులు పడుతోంది. చనిపోయినవారి అంత్యక్రియలకు రూ.10 వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇంతవరకు 7,500 మంది చనిపోయారు. ఏ ఒక్కరికైనా ఇచ్చారా? 2020 ఆగస్టు నాటికి కరోనా రోగుల చికిత్సకు 210 ఆసుపత్రుల్ని ప్రభుత్వం నోటిఫై చేస్తే... 2021 ఏప్రిల్ 24కి 195 మాత్రమే నోటిఫై చేశారు. మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తుంటే... ప్రభుత్వం వ్యవహరించాల్సింది ఇలాగేనా’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ విపత్కర సమయంలోనూ ప్రభుత్వ పథకాలపై ప్రతిరోజూ పత్రికల్లో భారీ ప్రకటనలు ఇవ్వడం మానేసి, ఆ డబ్బుని వ్యాక్సిన్‌లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సమకూర్చేందుకు వెచ్చించాలన్నారు.
పరీక్షలపై ఎందుకింత మొండితనం?
‘‘ప్రభుత్వం పాఠశాలలు తెరిచి 130 మంది ఉపాధ్యాయులు చనిపోవడానికి కారణమైంది. చాలామంది పిల్లలు, వారి వల్ల ఇళ్లల్లోని పెద్దలు కరోనా బారిన పడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా పరీక్షలు వాయిదా వేస్తే... ఏపీ ప్రభుత్వం మాత్రం పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు పెడతామంటోంది’’ అని ఆందోళన వ్యక్తంచేశారు.
‘‘రాష్ట్రంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి నిర్ధిష్ట కార్యాచరణ ఏదీ? 18 సంవత్సరాలు నిండినవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే రాష్ట్రంలో 3.50 కోట్ల మందికి వేయాలి. పత్రికల్లో ప్రకటనలు ఇస్తే, కేంద్రానికి లేఖలు రాస్తే సరిపోతుందా?’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
అది పైశాచిక ఆనందం కాక మరేంటి?
‘‘కరోనా విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో విశాఖలో పల్లా శ్రీనివాస్ భవనాన్ని కూల్చేయడం, గుంటూరు జిల్లాలో ధూళిపాళ్ల నరేంద్రపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం పైశాచిక ఆనందం కాకపోతే మరేంటి? సంగం డెయిరీపై నాడు వైఎస్ కోర్టుకి వెళ్లారు. కోర్టులో డెయిరీకి అనుకూలంగానే తీర్పు వచ్చింది. అమూల్ కోసం జగన్‌రెడ్డి ఇప్పుడు బాగా నడుస్తున్న వ్యవస్థల్ని విధ్వంసం చేస్తున్నారు. అది రైతుల సంస్థ, వారికి నష్టం కలిగించే అధికారం ఎవరిచ్చారు?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. కరోనా నియంత్రణకు అవసరమైతే వారం, పది రోజుల ముందు నుంచే ప్రజల్ని సిద్ధం చేసి... కేసులు మరీ ఎక్కువున్న చోట లాక్‌డౌన్ పెట్టాలని ఒక ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు తెలిపారు.
ఇవీ చదవండి