జులై 31 లోపు నాడు-నేడు కార్యక్రమం కింద పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయం, వైఎస్‌ఆర్ ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా, అంగన్ వాడీ కేంద్రాల పనులను వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు. గడువులోగా అన్ని నిర్మాణ పనులు పూర్తి కాకపోతే అధికారులపై తీవ్ర చర్యలుంటాయని ద్వివేది హెచ్చరించారు. అన్ని జిల్లాల పీడీ, డ్వామాలు, జిల్లా పరిషత్ సీఈఓలు, పంచాయతీ రాజ్ ఇంజినీర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనుల ప్రగతి, జిల్లా పీడీల పనితీరుపై సమీక్షించారు. పలు జిల్లాల అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మెరుగు పరచుకోకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ద్వివేది ఆదేశాలు మరికొన్ని..
- సిమెంట్, ఇసుక సమీకరణలో సమస్యలపై కలెక్టర్ల దృష్టికి తేవాలి
- ఉపాధి హామీ పథకంలో తలపెట్టిన ప్లాంటేషన్ పనులు వేగంగా పూర్తి చేయండి
- నిర్ణీత గడువులోగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కావాలి
- పేదలకు ప్రభుత్వం ఇస్తోన్న ఇళ్ల స్థలాల వద్ద మొక్కలు నాటండి
- ఇళ్ల స్థలాల్లో మొక్కలు నాటడం ప్రథమ ప్రాధాన్యంగా తీసుకోవాలి
- జులై 17, 18 నుంచి మొక్కలు నాటే పనులు ప్రారంభించండి
ఇదీ చదవండి