కృష్ణ జిల్లా గన్నవరం మండలం దావాజీగూడెంలో విమానశ్రయ రన్ వే విస్తరణలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు గన్నవరం - ఉంగుటూరు రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆర్ఆర్ ప్యాకేజీ కింద కేటాయించిన ఇళ్ల స్థలాలకు శాశ్వత పట్టాలు ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి మూడేళ్ల గడుస్తున్నా ఏటువంటి పురోగతి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని నిర్వాసితులు విచారం వ్యక్తం చేశారు. తమకు కేటాయించిన 5 సెంట్ల భూమికి శాశ్వత పట్టా ఇవ్వకుండా మరొకరికి కేటాయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
గన్నవరం సీఐ కె. శ్రీనివాసరావు, ఎస్ఐ వాసిరెడ్డి శ్రీనివాస్ అక్కడికి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. రెవిన్యూ అధికారులు నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన విరమించమని నిర్వాసితులు తేల్చిచెప్పారు. నిర్వాసితులను అడ్డుకునే క్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఆందోళన కారుల మధ్య వాగ్వాదం జరిగింది. తహసీల్దార్ నరసింహరావు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. కొలతలు వేసి స్ధలాలు కేటాయిస్తామని.. ఆర్ఆర్ ప్యాకేజీ కింద కేటాయించిన ఇళ్లు వేరే వారికి కేటాయించమని హామీ ఇవ్వటంతో నిర్వాసితులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్