ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ(ఏపీఏడీసీఎల్) ఆధ్వర్యంలో ఇండిగో విమానయాన సంస్థతో ఒప్పందం చేసుకుని వయబులిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) విధానంలో సింగపూర్‌కు వారానికి రెండు సర్వీసులు నడిపారు. ఈ నాలుగేళ్లలో గన్నవరం నుంచి నడిచిన అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇవే. తాజాగా జజీరా ఎయిర్‌లైన్స్, ఎయిరిండియా లాంటి విమానయాన సంస్థలు విదేశాలకు సర్వీసులను నడిపేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.
కానీ.. ఇవి వాస్తవ రూపం దాలుస్తాయో.. లేదో అనే సందేహాలు ఉన్నాయి. జజీరా ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రతినిధులు ఐదారు నెలల క్రితం గన్నవరం వచ్చి పరిశీలించి వెళ్లారు. కువైట్, దుబాయి రెండింటిలో ఒక దేశానికి ముందుగా విమాన సర్వీసులు గన్నవరం నుంచి నడపాలని ఆసక్తి కనబరిచారు. కానీ.. ఆ తర్వాత ఆ ప్రతిపాదనలు ముందుకు వెళ్లలేదు. తాజాగా ఎయిరిండియా విమాన సంస్థ మస్కట్‌కు షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. కానీ.. గాలిలోకి విమానం లేచేవరకు ఇది కార్యరూపం దాలుస్తుందో లేదో చెప్పడం కష్టం.
గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుంది. తాజాగా కువైట్, దుబాయి, మస్కట్, అమెరికా, లండన్, ఇంగ్లండ్ సహా అనేక దేశాల నుంచి వందేభారత్ మిషన్‌లో భాగంగా వేలాది మంది ప్రయాణికులు వస్తున్నారు. గత ఆరేడు నెలలుగా నిత్యం అంతర్జాతీయ విమాన సర్వీసులు గన్నవరానికి వస్తూనే ఉన్నాయి. 2018 డిసెంబరు నుంచి 2019 జూన్ వరకు సింగపూర్‌కు నడిచిన సర్వీసులకు భారీగా డిమాండ్ ఉండేది.
75 శాతం నుంచి 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడిచేవి. దుబాయ్ లాంటి దేశాలకు సర్వీసులను నడిపితే కచ్చితంగా 90 శాతానికి పైగా ఆక్యుపెన్సీ ఉంటుందని.. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ వంటి సంస్థలు పక్కాగా లెక్కలతో సహా పౌర విమానయాన శాఖకు నివేదించాయి. అయినా ఇక్కడి నుంచి సర్వీసులు నడిపేందుకు కేంద్రం ఎప్పుడూ సుముఖత చూపించలేదు. అందుకే గతంలోనూ చాలా విమానయాన సంస్థలు అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు ఆసక్తి కనబరిచినా అనుమతుల జాప్యంతో వెనుదిరిగాయి.
నెరవేరని దుబాయి కల..
గన్నవరం నుంచి దుబాయికి విమాన సర్వీసు కావాలంటూ ఎన్నో ఏళ్లుగా విజ్ఞప్తులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2018లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఏకంగా రెండున్నర లక్షల మంది దుబాయి సర్వీసు కావాలంటూ కోరారు. ఈ స్పందనను చూసిన రాష్ట్ర ప్రభుత్వం వీజీఎఫ్ పద్ధతిలోనైనా సర్వీసులు నడిపేందుకు విమానయాన సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దుబాయికి సర్వీసులు ఆరంభమైతే అనేక దేశాలకు సులభంగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. దుబాయిలో చదువుకునేందుకు పెద్దఎత్తున విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్తున్నారు. వారితో పాటు పర్యాటకంగా చూపి వచ్చేందుకు ఏటా వేల మంది దుబాయికి వెళ్లి వస్తున్నారు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకూ ఇక్కడి నుంచి అధికంగా వెళ్తుంటారు.
ప్రస్తుతం గన్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ సేవలు అందించేందుకు అవసరమైన అన్ని మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయి. కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ సహా అన్ని విభాగాలు ఏర్పాటై ఉన్నాయి. సింగపూర్ సర్వీసులు ఆగిపోయిన తర్వాత ఏడాదికి పైగా ఈ విభాగాలకు పని లేకుండా పోయింది. అంతర్జాతీయ టెర్మినల్ ఖాళీగా ఉండిపోయింది. కనీసం ఇప్పటికైనా ఆసక్తి కనబరిచే విమానయాన సంస్థలను ప్రోత్సహించి ఇక్కడి నుంచి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి: