కరోనాతో మృతి చెందిన రోగి బంధువుల దాడికి నిరసనగా తెలంగాణ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోని జూడాలు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు ...తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఓ వైద్యుడిపై దాడిని ఖండిస్తూ పూర్తి స్థాయిలో విధులను బహిష్కరించి... గాంధీ ఆసుపత్రి బయట రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు జూడాల నిరసనలతో కరోనా రోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స అందిస్తుంటే...తమపై దాడికి పాల్పడటం దారుణమని జుడాలు వాపోయారు. అన్ని వార్డుల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఐదు డిమాండ్లు..
గాంధీ ఆసుపత్రిలో మెుత్తం1000 మంది జూనియర్ డాక్టర్లు ఉండగా.... ప్రస్తుతం 300 మంది జూడాలు పూర్తి స్థాయిలో విధుల్లో కొనసాగుతున్నారు. తమపై అధిక పనిభారం ఉన్నా విధులు నిర్వర్తిస్తున్నామని జూడాలు చెబుతున్నారు. ధర్నాకు దిగిన వైద్యులతో మంత్రి ఈటల దాదాపు 3 గంటల పాటు చర్చలు నిర్వహించారు. ప్రధానంగా ఐదు డిమాండ్లను జూడాలు మంత్రి ముందుంచారు.
గాంధీలో అవసరమైన మేరకు ఎస్పీఎఫ్ బలగాలను అందుబాటులో ఉంచడం, జీఓ నెంబర్ 103 అమలు, గాంధీ సహా ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ కోవిడ్ సేవలను అందించటం, అత్యవసరంగా వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్‌ని రిక్రూట్ చేయాలని కోరారు. ఆయా అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్న హామీతో జూడాలు విధుల్లో చేరుతున్నారంటూ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
హామీ రాలేదు..
అయితే కొద్ది సేపటికే తమ డిమాండ్లకు సరైన హామీ రాలేదని... నిరసనలు కొనసాగిస్తున్నామని జూడాలు ప్రకటించారు. తమపై దాడికి నిరసనగా చేపట్టిన దీక్షకు పలువురు నాయకులు మద్ధతు తెలిపారు. వైద్యులపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు సంఘీభావం ప్రకటించారు.
ఇవీ చూడండి: అత్త మీద కోపంతో కన్నబిడ్డను పొడిచి చంపిన తల్లి!