BJP leaders spoke on Viveka's murder case సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత అవినాష్‌కు హైకోర్టులో బెయిల్ రాదని మాజీమంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ పేర్కొన్నారు. వివేకా హత్య కేసు విచారణ ఎలా చేయాలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడంతో పాటు అనుకూల తీర్పు రాలేదన్న అక్కసుతో దర్యాప్తు సంస్థలపై నమ్మకం లేదంటున్నారని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని ఆయన అన్నారు.
సీబీఐకి అన్నీ తెలుసు.. వివేకా హత్య ఘటన పెద్ద కుట్ర అని సీబీఐకి తెలుసు.. సీబీఐ సిట్ దర్యాప్తు, సుప్రీం కోర్టు తాజా తీర్పుల నేపథ్యంలో వివేకా హత్యతో సంబంధమున్న వారంతా బయటకు వస్తారని ఆది నారాయణరెడ్డి అన్నారు. అందుకే అరెస్టు చేస్తారని భయపడే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం వెళ్లాడని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు.
పథకం ప్రకారమే హత్య.. వైఎస్ వివేకాను పథకం ప్రకారమే హత్య చేశారని, హత్య చేసి ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారని తెలిపిన ఆదినారాయణ రెడ్డి.. హత్య ఎలా జరిగిందో కుటుంబ సభ్యులకు ఎలా తెలిసింది? అని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో తమపై లేని పోని అభాండాలు వేస్తున్నారని, సీబీఐ విచారణను ఎందుకు తప్పు పడుతున్నారు? అని మండిపడ్డారు. వివేకా హత్య కేసు దర్యాప్తు చేయాలని అమెరికా వెళ్తారా.. కోర్టు తీర్పులన్నీ వారికి అనుకూలంగా రావాలా..? అని ప్రశ్నించారు.
కొంతైనా శ్రద్ధ పెడితే.. ఎంపీ అవినాష్ రెడ్డి కేసు విషయంలో చూపించిన శ్రద్ధలో కొంతైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై పెట్టలేదని బీజేపీ ఆరోపించింది. సొంత పార్టీపైనా పట్టుకోల్పోయారని.. త్వరలో ఊహించని రాజకీయ పరిణామాలను జగన్ ఎదుర్కొంటారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. జగన్ హటావో... ఏపీ బచావో అనే నినాదంతో పెద్ద ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేయబోతున్నామని తెలిపారు. మే ఐదు నుంచి క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్యాయాలపై ఛార్జిషీటు వేయబోతున్నామన్నారు.
జగన్ పై నమ్మకం పోయింది.. జగన్మోహన్ రెడ్డిపై నమ్మకం ఎంతగా సడలిందనడానికి... రాయలసీమ ప్రాంత వాసులు తమను పక్క రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేయడమే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. ఇలాంటి పరిస్థితి రావడానికి జగనే కారణమని విమర్శించారు. రాయలసీమ వాసిగా ఎందుకు ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత తర్వాత కూడా ఇంతవరకు రాయలసీమకు ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని నిలదీశారు. గాలేరు నగరి, హంద్రీనివా, వెలిగొండ సిద్ధేశ్వరం తదితర ప్రాజెక్టులు నత్తననడక నడుస్తుండడానికి కారణం ఏమిటని... రాయలసీమ ప్రజలకు జగన్ ద్రోహం చేసింది నిజం కాదా? అని రమేష్‌నాయుడు ప్రశ్నించారు.
ఇవీ చదవండి :