విదేశీ సిగరెట్ల అమ్మకాలు విజయవాడ సహా కృష్ణా జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా భారీగా జరుగుతున్నాయి. చిన్న చిన్న పాన్ షాపులు, దుకాణాలకు వీటిని తరలించి పెద్దఎత్తున విక్రయాలు జరుపుతున్నారు. విదేశాల నుంచి తీసుకొచ్చిన తర్వాత విజయవాడలోని కొన్ని గోదాముల్లో వీటిని నిల్వ చేసి అక్కడి నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు తరలిస్తుంటారు. అక్రమ మార్గాల్లో ఈ సిగరెట్లను విజయవాడకు తీసుకొస్తున్నారు. పెద్ద ట్రక్కుల్లో పైన దుస్తులు, ఇతర సామగ్రిని ఉంచి.. కింది భాగంలో ఈ సిగరెట్లను కనిపించకుండా పెట్టి.. రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తున్నారు. గత రెండు మూడేళ్లలో అనేకసార్లు కస్టమ్స్, వాణిజ్య పన్నులు, పోలీసు తనిఖీల్లో విదేశీ సిగరెట్లు పట్టుబడ్డాయి.
30 లక్షల సిగరెట్లు
తాజాగా 4 రోజుల కిందట డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ), రాష్ట్ర పన్నుల శాఖ విజయవాడ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన దాడుల్లో 30లక్షల వరకూ విదేశీ సిగరెట్లు దొరికాయి. ఇంత భారీగా దొరకడం ఇదే తొలిసారి. ప్రస్తుతం వీటిని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. వీటిని మయన్మార్‌లో తయారుచేసి.. ఇక్కడికి అక్రమ మార్గంలో తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో సిగరెట్ ధర రూ.10 ఉంటుందని అంచనా వేశారు. 30లక్షల సిగరెట్ల ధర రూ.3 కోట్ల వరకూ ఉంటుందని నిర్ణయించారు.
డ్రైవర్లకు తెలియదా!
వీటితో పాటు దేశీయ సిగరెట్లను తరలిస్తున్న మరో ట్రక్కును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పన్నులు చెల్లించకుండా ఈ సిగరెట్లు తరలిస్తున్నట్టు గుర్తించారు. వీటిని మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి విజయవాడకు తీసుకొచ్చినట్టు గుర్తించారు. విజయవాడ రాష్ట్ర పన్నుల శాఖ డివిజన్-1 పరిధిలో ఈ ట్రక్కును ఉంచారు. ఈ ట్రక్కుల డ్రైవర్లు తమకేం తెలియదని చెబుతున్నారు. తాము మధ్యలో ట్రక్కు డ్రైవర్లుగా ఎక్కామని చెబుతున్నారు. అంతకుముందు వీటిని తీసుకొచ్చిన డ్రైవర్లు తమకు మధ్యలో అప్పగించి వెళ్లిపోయారంటుండడంతో ఈ సరకు ఎవరిదని తేల్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
ఆకర్షణీయం.. అధిక ధర
టొబాకో ఉత్పత్తులకు కస్టమ్స్ పన్నులు భారీగా చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా అన్ని నిబంధనల ప్రకారం విదేశాల్లో తయారైన సిగరెట్లు, సరైన ప్యాకింగ్ ఉండాలి. ధూమపానం ప్రమాదకరమని సూచించాలి. ఇవన్నీ ఉంటేనే కస్టమ్స్ చట్టం ప్రకారం పన్ను చెల్లించి దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తారు. ఇవన్నీ లేకుండా అక్రమ మార్గాల్లో తీసుకొచ్చి.. ఇక్కడ భారీ ధరకు అమ్ముకుంటుంటారు. గతంలో అనేకసార్లు అధికారులు వీటిని పట్టుకున్నారు. వీటిని తీసుకొచ్చేటప్పుడు ఎక్కడా దొరకకుండా ఉండేందుకు పక్కాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ట్రక్కులో పెద్ద స్టెయిన్‌లెస్ స్టీల్ బాక్సులు, దాని లోపల గోనెసంచుల బ్యాగులు.వాటిలో అట్టపెట్టెల్లో పెట్టి వీటిని తీసుకొస్తున్నారు.
తాజాగా అధికారులు పట్టుకున్న ట్రక్కు ఖరీదు రూ.24.75లక్షలు, స్టెయిన్‌లెస్ స్టీల్ వేర్ రూ.1.26లక్షలు ఉంటుందని ధర నిర్ణయించారు. విదేశాల నుంచి వచ్చే ఈ సిగరెట్ల ప్యాకెట్ చూసేందుకు ఆకర్షణీయంగా ఉండడంతో పాటు కాస్త ఘాటు కూడా ఎక్కువే ఉండడంతో వీటిని ఎంత డబ్బులైనా వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు. ప్రధానంగా యువత కూడా ఈ విదేశీ అక్రమ సిగరెట్లకు విజయవాడ లాంటి నగరాల్లో అలవాటు పడుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పట్టుకున్న సిగరెట్లను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి తగలబెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవీ చదవండి.... 'బాధ్యత కాదంటే కుదరదు.. కొత్త ఎల్ఈడీ టీవీ ఇవ్వాల్సిందే..'