కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల మీదుగా ప్రవహించే మున్నేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు మున్నేరు వాగుకు పోటెత్తటంతో.. గురువారం ఉదయం నుంచి వరద ప్రవాహ ఉద్ధృతి పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వత్సవాయి మండలం పోలంపల్లి ఆనకట్ట వద్ద 11 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుండటగా.. దిగువకు 29 వేల 709 క్యూసెక్కుల వరద నీరు కృష్ణా నదిలోకి చేరుతోంది. మున్నేరు వాగుకు వరద ఉద్ధృతి పెరగటంతో వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల తహసీల్దార్లు అప్రమత్తమయ్యారు. వత్సవాయి మండలం లింగాల గ్రామం వద్ద మున్నేరు వాగుపై ఉన్న లో లెవెల్ వంతెనను తాకుతూ వరద నీరు ప్రవహిస్తోంది. వరద నీరు వంతెన పైకి చేరితే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల మధ్య రవాణా సదుపాయం నిలిచిపోయే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చదవండి: మున్నేరుకు భారీ వరద... ప్రవాహంలో చిక్కుకున్న పశువుల కాపరులు