Crop Losses Due To Heavy Rains In AP: ఖరీఫ్, రబీల్లో సాగు చేసిన అన్నదాతల 9 నెలల కష్టాన్ని..అకాల వర్షాలు తుడిచిపెట్టేశాయి. మొక్కజొన్న పంట భారీగా దెబ్బతింది. కొన్ని జిల్లాల్లో ఖరీఫ్ సీజన్‌లో నూర్చిన ధాన్యం వానలకు తడిసిపోగా.. రబీలో సాగు చేసిన వరి చేతికందే దశలో వర్షం కురవడంతో..గింజ రాలిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా.. సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు వర్షార్పణమయ్యాయని అంచనా. సగటున ఎకరాకు.. 20 వేల రూపాయల లెక్కన చూసినా రైతులు.. రూ.400 కోట్లకు పైనే నష్టపోయారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతుల వద్ద ఇంకా 4 లక్షల టన్నుల వరకూ.. ధాన్యం నిల్వలుండగా లక్ష టన్నుల కొనుగోలుకు.. అధికారులు అనుమతిచ్చారు. తోట్లవల్లూరు, ఉంగుటూరు, గూడూరు, అవనిగడ్డ, గుడ్లవల్లేరు మండలాల్లో.. కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. రంగు మారుతుందని రైతులు ఆందోళన.. చెందుతున్నారు. రబీలో వేసిన వరి, జొన్న, మొక్కజొన్న పడిపోయాయి. సుమారు 40 వేల ఎకరాల్లో రెండో పంటగా వేసిన మినుము పనలపై ఉండగా తడిసింది. ఎకరానికి దాదాపు రూ.10 వేల వరకు నష్టం వస్తుందని రైతులు చెప్తున్నారు.
ఏలూరు జిల్లా.. టి.నరసాపురం, జీలుగుమిల్లి, చింతలపూడి, జంగారెడ్డిగూడెం తదితర మండలాల్లో మొక్కజొన్న, వర్జీనియా పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో జొన్న, మొక్కజొన్న కండెలు.. పాలుపోసుకునే దశలో తడిశాయి. వరి చేలపై వడగళ్ల ధాటికి గింజలు నేలరాలాయి. కాకినాడ జిల్లా గొల్లప్రోలు, పిఠాపురం, ప్రత్తిపాడు మండలాల్లో వరి, మొక్కజొన్నతో పాటు.. నువ్వుల చేలూ నీట మునిగాయి.
నెల్లూరు జిల్లా.. ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు నియోజకవర్గాల్లోని 125 గ్రామాల్లో.. 9 వేల ఎకరాల దెబ్బతిన్నట్లు భావిస్తున్నారు. కల్లాల్లో.. ఆరబెట్టిన ధాన్యం తడిసింది. అనంతపురం జిల్లాలో 7,500 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, కొర్ర తదితర పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాల్లో.. పత్తి, మిరప, పొగాకు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు.. దెబ్బతిన్నాయి.
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో.. సుమారు 23 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు అంచనా. YSR, అన్నమయ్య జిల్లాల్లో.. సుమారు 2,500 ఎకరాల్లో వివిధ పంటలు వర్షార్పణమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో పొలాలు, ఇళ్ల ముందు బస్తాల్లో ఉన్న ధాన్యం తడిసి రంగు మారుతోందని.. రైతులు వాపోతున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో.. 2,200 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో లంక పొగాకు, మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిన్నాయి.
ఇవీ చదవండి: