వ్యవసాయ విద్యుత్తు నగదు బదిలీ పథకం అమలు కోసం కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో రైతుల్లో కొత్త సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఉచిత విద్యుత్తు పొందుతున్న రైతులు ఆదాయపు పన్ను పరిధిలో ఉంటే పథకం వర్తిస్తుందా? కార్పొరేట్ రైతులు వినియోగించే విద్యుత్తుకు ఛార్జీలను ఎలా లెక్కిస్తారు? లాంటి సందేహాలకు ప్రభుత్వ ఉత్తర్వుల్లో స్పష్టత లేదు. ప్రస్తుతం భూ యాజమాన్య హక్కులు ఒకరి పేరిట.. విద్యుత్తు కనెక్షన్ మరొకరి పేరిట ఉన్నాయి. పథకం అమలు కోసం ఈ రెండింటిని ఒకరి పేరుమీదే ఉండేలా మార్చనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వ్యాపారులు, కొందరు ప్రభుత్వోద్యోగులు వ్యవసాయ భూములు కొన్నారు. యాజమాన్య హక్కులు మార్చుకున్నారు. విద్యుత్తు కనెక్షన్ మార్చుకోలేదు. ఇప్పుడు కొత్తగా హక్కు పత్రాలు, కనెక్షన్, బ్యాంకు ఖాతాలో ఒకే పేరున ఉండేలా మార్పు చేయనున్నారు. ఇలా చేస్తే పన్ను పరిధిలో ఉన్నవారి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వారికీ ఉచిత విద్యుత్తు నగదు బదిలీ పథకాన్ని కొనసాగిస్తారా లేదా అనే సందేహం నెలకొంది. ఇలాంటివారు వేల సంఖ్యలో ఉంటారని అంచనా.
- కార్పొరేట్ రైతులకు ఎలా లెక్కిస్తారు?
రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ సంస్థ (ఏపీఈఆర్‌సీ) 2020-21 సంవత్సరానికి నిర్దేశించిన టారిఫ్ ప్రకారం వినియోగంతో సంబంధం లేకుండా ఒక్కో హెచ్‌పీకి రూ.200 వంతున కార్పొరేట్ రైతులు చెల్లిస్తున్నారు. ఇలాంటి కనెక్షన్లు రాష్ట్రవ్యాప్తంగా 10వేల వరకు ఉన్నాయి. నగదు బదిలీ పథకంలో భాగంగా కార్పొరేట్ రైతులకూ విద్యుత్తు మీటర్లు ఏర్పాటు చేసి.. వినియోగాన్ని నమోదు చేయనున్నారు. ఏ టారిఫ్ ప్రకారం వారి నుంచి ఛార్జీలను వసూలు చేస్తారు? వినియోగం ఆధారంగా వసూలు చేస్తే అదనపు భారాన్ని ఎవరు భరిస్తారో ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.
ఇదీ చూడండి. పరిహారం కోసం ముంపు వాసుల నిరసన