దిల్లీ సరిహద్దులో రైతులు చేస్తోన్న నిరసనకు సంఘీభావంగా విజయవాడ బెంజ్ సర్కిల్‌లో రైతు సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, సీపీఎం నాయకుడు బాబూరావు, ఇతర రైతు సంఘాల నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు.
బెంజ్ సర్కిల్ వద్ద రాస్తారోకో సమయంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై బైఠాయించి రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాస్తారోకోతో బెంజ్ సర్కిల్ నాలుగు కూడళ్ల వద్ద ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచి పోయింది. పోలీసులు నిరసనకారులను బలవంతంగా వాహనాలు ఎక్కించి వివిధ పోలీసుస్టేషన్లకు తరలించారు.
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరతూ... తెదేపా ఆధ్వర్యంలో సీపీఐ, సీపీఎంలతో కలిసి రైతులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో జగ్గయ్యపేట మాజీఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, కమ్యూనిటి నేతల సుబ్బారావు వ్యవసాయ వ్యతిరేక చట్టాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతులకు భారం కానున్న వ్యవసాయ మీటర్లను అనుమతించవగద్దని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.