వ్యవసాయ రంగంలో రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా జనవరి 8వ తేదీన దేశ వ్యాప్తంగా రైతాంగం గ్రామీణ భారత్ బంద్‌ను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ జయప్రదం చేయాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. భారత రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ధోరణిని నిరసిస్తూ విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో రైతు సంఘాల నాయకులతో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు చేయాలని... పంటలకు సమగ్ర ఉత్పత్తి వ్యయానికి యాభైశాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరను రైతుల హక్కుగా చట్టం చేయాలని సమావేశంలో తీర్మానించామని మాజీ మంత్రి అన్నారు. ఇతర దేశాల్లో నిషేధించబడిన పురుగుమందులను దేశంలో కూడా నిషేధించాలని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల నుండి వ్యవసాయాన్ని తొలగించాలని కోరారు. జనవరి 8న కార్మికులు తలపెట్టిన దేశవ్యాప్త బంద్‌తో పాటు గ్రామీణ భారత్ బంద్‌ను కూడా జయప్రదం చేయాలని కోరారు.
ఇదీ చదవండీ: