Seeking Government Help: ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని ఆ ఇంటి వాళ్లంతా సంతోషపడతారు. ఆడపిల్ల నట్టింట్లో తిరిగితే సంబరపడిపోతుంటారు. బిడ్డ సంతోషంగా కళ్లముందే ఉండాలని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. అలాంటిది అంతుచిక్కని వ్యాధితో పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డ మంచానికే పరిమితం అయితే ఆ తల్లిదండ్రులు పడే ఆవేదన మాటల్లో చెప్పలేనిది.
తల్లి ఒడిలో ఎముకల గూడులా ఉన్న అప్పికట్ల అలేఖ్య.. కృష్ణా జిల్లా కోడూరు మండలం లింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన వెంకటసుబ్బారావు, సుజాత దంపతుల మొదటి సంతానం. అలేఖ్య తర్వాత ఆ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. అలేఖ్య వయసు ప్రస్తుతం 16 ఏళ్లు. శారీరక ఎదుగుదల లేక అరుదైన వ్యాధితో ఇబ్బందులు పడుతోంది.
ఎటువంటి చలనం లేకపోవడంతో కనీస అవసరాలను కూడా.. ఆమె తల్లి, నానమ్మే తీరుస్తున్నారు. ఎన్ని ఆసుపత్రులు తిప్పినా.. బతికినన్ని రోజులు ఇలాగే ఉంటుందని చెప్పి మందులు ఇస్తున్నారే తప్ప.. వ్యాధికి గల కారణాలను మాత్రం ఏ వైద్యుడు చెప్పలేకపోతున్నారు. పనికెళ్తే గాని పూట గడవని పరిస్థితి ఆ కుటుంబానిది. అయినా కుమారైకు నయం చేయించాలని స్థాయికి మించి అప్పులు చేసి ఆసుపత్రులు చుట్టూ తిరుగుతున్నారు.
అనాథ శరణాలయంలో చేరిపించండి.. లేదా పడేయండి అని స్థానికులు చెప్తున్నా.. ఆ మాతృమూర్తి మాత్రం వాటిని పట్టించుకోకుండా. కంటికి రెప్పలా తన బిడ్డకు సేవలు చేస్తూ కాపాడుకుంటుంది. తమ్ముళ్లు సైతం తమ అక్కని అంతే ప్రేమగా చూసుకుంటున్నారు. కూలీ పనులు చేసుకునే తమకు ఒకవైపు పాప ఆరోగ్య ఖర్చులు, మరోవైపు పిల్లల చదువుకు సరిపడా డబ్బు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నామని తల్లి సుజాత ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆర్థిక సాయం అందించాలని కలెక్టర్కు అర్జీ పెట్టుకున్నా.. అక్కడికి వెళ్లు, ఇక్కడికి వెళ్లు అని తిప్పుతున్నారే తప్పా.. సాయం చేయటం లేదని కన్నీటి పర్యంతమవుతోంది.
"మా పాపను 16 సంవత్సరాలుగా ఇలాగే చూసుకుంటున్నాం. ఎక్కడికి వెళ్లినా స్పందించలేదు. ఆహారం తినలేదు. 16 సంవత్సరాలుగా పాలు మాత్రమే ఇస్తున్నాం. ప్రభుత్వం ఇస్తున్న పింఛను సరిపోవడం లేదు. ఎక్కువ ఇమ్మని కలెక్టర్ గారికి ఇప్పటి వరకూ నాలుగు సార్లు అర్జీ పెట్టుకున్నా.. స్పందించలేదు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం". - సుజాత, అలేఖ్య తల్లి
తన కొడుకు, కోడలు పనులకు వెళ్లి కష్టపడుతుంటే నానమ్మ ధనలక్ష్మీ మాత్రం ఇంటి దగ్గరే ఉండి ఆలేఖ్యను చూసుకుంటుంది. పాప ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని ఎంత ప్రయత్నం చేసిన కుదరడం లేదని.. గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఆసుపత్రుల్లో చూపించినా.. ఫలితం లేదంటున్నారని వాపోయింది.
తమ మనవరాలు పుట్టడమే ఏడుపు లేకుండా పుట్టిందని అప్పటినుంచి.. దేవుడికి సేవ చేసినట్లు అలేఖ్యకు సేవ చేస్తున్నానని బోరున విలపిస్తోంది. 16 సంవత్సరాల నుంచి కేవలం పాలు, మందులనే అలేఖ్యకు ఆహారంగా ఇస్తుండటంతో నెలకు 5వేలకు పైనే ఖర్చవుతోంది. దీంతో ప్రభుత్వం ఇచ్చే పింఛను సరిపోవటంలేదని.. ప్రభుత్వం స్పందించి తమ బిడ్డ అవసరాలు తీరేలా నెలకు 10 వేలు పెన్షన్ మంజూరు చేయాలని ఆ కుటుంబం కోరుతోంది.
"పుట్టిన మూడేళ్లకే చనిపోతది అన్నారు. కానీ అలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాం. వాళ్లిద్దరూ పొలంకి వెళ్తే.. నేను ఇంటి దగ్గర ఉండి చూసుకుంటున్నాను. చాలా మంది పడేయమని చెప్పారు. 16 సంవత్సరాలుగా చేస్తున్నాను". - ధనలక్ష్మీ, అలేఖ్య నానమ్మ
ఇవీ చదవండి: