భారత ఎన్నికల సంఘం ప్రతినిధులు నేటి నుంచి 2 రోజులపాటు విజయవాడలో పర్యటించనున్నారు. రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్దతపై సమీక్షించనున్నారు.
భారత ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసాలతోపాటు ఎన్నికల సంఘం అధికారులు ఉదయం 8.15 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అధికార బృందంలో ఉమేష్ సిన్హా, సందీప్ సక్సేనా, సందీప్‌జైన్, నిఖిల్‌కుమార్, దిలీప్‌శర్మ, దీరేంద్ర ఓజా, ఎస్.కె.రుడోలా ఉన్నారు.
ఎన్నికల సంఘం ఉదయం 10.30 గంటలకు విజయవాడలోని నోవోటెల్ హోటల్‌లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో భేటీ అవుతుంది. అనంతరం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారులు ఇచ్చే ప్రదర్శనను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3 గంటలనుంచి సాయంత్రం 6.30 నిమిషాల వరకు కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు ఇతర అధికారులతో సమావేశంలో పాల్గొంటారు.12న నోడల్ అధికారులు, రాష్ట్ర పోలీసు, ఆదాయపన్ను, రవాణా, వాణిజ్యపన్నులు, రైల్వే, ఎయిర్‌పోర్టు అధికారులతో చర్చిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీలతో సమావేశమవుతారు. మంగళవారం రాత్రి తిరిగి దిల్లీ వెళ్తారు