హైదరాబాద్ ఎనిమిదవ నిజాం ముకర్రం ఝా అంత్యక్రియలు మక్కా మసీదులో ప్రాంగణంలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు ఆయనకు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. ముకర్రం ఝా కడసారిచూపు కోసం నగరంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున బంధుమిత్రులు, అభిమానులు మక్కా మసీదు ప్రాంతానికి చేరుకుని అంతిమయాత్రలో పాల్గొన్నారు.
తుర్కియేలో మరణించిన ముకర్రం ఝా పార్థీవదేహాన్ని కుటుంబసభ్యులు నిన్న హైదరాబాద్‌కు తరలించారు. చౌమహల్లా ప్యాలెస్‌లోని దర్బార్ హాల్‌లో ఉంచిన భౌతిక కాయానికి సీఎం కేసీఆర్, ఎంపీ అసదుద్దీన్ ఇతర ప్రముఖుల నివాళులర్పించారు. కుమారుడు ప్రిన్స్ అజ్మత్‌జా, భార్య ప్రిన్సెస్ ఎస్రా, కుమార్తె షాహిబ్జాది బేగంలను తెలంగాణ ముఖ్యమంత్రి పరామర్శించారు.
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సాధారణ ప్రజలు భౌతికకాయాన్ని చూసేందుకు అనుమతించారు. అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌లో ముకర్రం ఝాకు సంప్రదాయబద్దంగా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత.. ప్రభుత్వం తరఫున పోలీసులు గౌరవ వందనం చేశారు. ఆ తర్వాత ముకర్రం ఝా కుటుంబసభ్యుల అంగీకారంతో.. అయన పార్ధివదేహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన డోలలో అంతిమ యాత్ర నిర్వహించారు.
పోలీసుల గౌరవ వందనంతో చౌమహల్లా ప్యాలెస్.. నుంచి ప్రారంభమై మక్కా మసీదు వరకు కొనసాగింది. దారి పొడవునా ప్రజలు నివాళులర్పిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. మక్కా మసీదులోని ఆసఫ్‌జాహీల సమాధుల పక్కనే.. ముకర్రం ఝా పార్థీవదేహాన్ని ఖననం చేశారు. ఈ అంతిమయాత్రలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు , కార్పొరేటర్లు, మాజీమంత్రి షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, చరిత్రకారులు వేదకుమార్ తదితరులు పాల్గొన్నారు.
వారసత్వంగా ఆస్తులు.. అద్దె గదిలో మరణం: ఉస్మాన్ అలీఖాన్ అప్పట్లో ప్రపంచ కుబేరుడిగా గుర్తింపు పొందారు. ఆయనకు వారసుడిగా.. ముకర్రమ్‌ఝా సైతం చిన్నతనంలోనే ప్రపంచ కుబేరుడయ్యారు. అనంతరం విలాసాలకు, ఆర్భాటాలకు పోయి దివాలా తీశారు. భార్యలతో విభేదాల కారణంగా మనోవర్తి కేసులు, ఇతర ఆస్తి వివాదాలతో సతమతమయ్యారు. ఆయన సంతానం సైతం ఆస్తి కోసం కేసులు వేయడం, హైదరాబాద్‌లోని మేనత్తలు, వారి వారసులు కోర్టుకెక్కడంతో నగరంలోని ఆస్తులను అమ్మడానికి వీల్లేకుండా కోర్టు ఆంక్షలు విధించింది. దీంతో ఓ దశలో చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయింది. చివరికి ముకర్రమ్‌ఝా ఇస్తాంబుల్‌లోని ఓ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌కే పరిమితమయ్యారని ‘ది లాస్ట్ నిజాం.. ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ప్రిన్స్‌లీ స్టేట్’ అనే పుస్తకంలో ఓ విదేశీ జర్నలిస్టు పేర్కొన్నాడు.
ఇవీ చదవండి :