Huge increase in electricity demand : రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగింది. నిన్న ఒక్క రోజే 255 మిలియన్ యూనిట్లకు విద్యుత్ వినియోగం పెరిగింది. 248 మిలియన్ యూనిట్ల మేరకే సరఫరా చేసిన డిస్కమ్ లు దాదాపు 7 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరాలో కొరత ను భర్తీ చేయలేకపోయాయి. దీంతో డిస్కమ్ లు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అనధికార విద్యుత్ కోతలు విధించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12,482 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. జెన్ కో నుంచి కేవలం 95 మిలియన్ యూనిట్ల మాత్రమే విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా 112 మిలియన్ యూనిట్ల మేర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాల నుంచి సేకరిస్తున్నారు. మిగతా మొత్తాన్ని బహిరంగ విద్యుత్ ఎక్చేంజీల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది.
విద్యుత్ ఒప్పందాలపై విచారణకు సిద్ధమా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై 50వేల కోట్ల రూపాయల భారం మోపిందని ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. వ్యక్తిగత ప్రయోజనాలు, స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయాల వల్ల విద్యుత్ సంస్థలు నష్టాల్లోకి వెళ్లాయని దుయ్యబట్టారు. ప్రభుత్వం చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
విద్యుత్ రంగంలో అక్రమాలు... విద్యుత్ కోతలు, ప్రజలపై ఛార్జీల వాతలు పడడానికి కారణం ప్రభుత్వ విధానాలేనని కేశవ్ మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ 7 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరతలో ఉందన్న ఆయన.. పీపీఏలను పక్కన పెట్టడం వల్ల ప్రజలు ఒక్కో యూనిట్‌కు రెండుసార్లు ఛార్జీలు చెల్లించాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఓపెన్ మార్కెట్ ద్వారా 12 వేల కోట్ల విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆక్షేపించారు. విద్యుత్ రంగంలో దారుణమైన తప్పిదాలు, అవకతవకలకు తెర లేపిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్జలు, అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టి విచారించాలన్నారు.
అధిక ధరకు స్మార్ట్ మీటర్లు ఎందుకు..? డిస్కంలు ఆర్థిక పరిపుష్టిగా లేనప్పుడు, అధిక ధరలతో స్మార్ట్ మీటర్లు బిగించడం అవసరమా అని ప్రశ్నించారు. కేంద్రం చేసిన సూచనలకంటే అధిక ధరలకు స్మార్ట్ మీటర్లు కొనుగోలు చేయడం ఎందుకు అని నిలదీశారు. ఓపెన్ మార్కెట్ లో విద్యుత్ కొనుగోళ్లు, స్మార్ట్ మీటర్ల కొనుగోళ్లల్లో ప్రభుత్వ పెద్దలకు లబ్ధి చేకూరిందని పయ్యావుల ఆరోపించారు.
టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగాన్ని మిగులు విద్యుత్‌గా మార్చారు. కానీ, ఈ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చే నిర్ణయాలు తీసుకుంది. బొగ్గు కొనుగోళ్లలో అక్రమాలు, సరైన నిల్వలు పెట్టకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. ఉన్నటువంటి సంస్థల్ని అధిక ధరకు ప్రైవేటు పరం చేయడం, కేంద్ర సంస్థల నుంచి తక్కువ ధరకు విద్యుత్ వస్తున్నా ప్రైవేటు సంస్థలను ఆశ్రయించడం వల్ల అవినీతి పెరిగిపోయింది. - పయ్యావుల కేశవ్, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్
ఇవీ చదవండి :