కృష్ణా జిల్లా పెదముత్తేవి గ్రామంలోని శ్రీ కృష్ణ ఆశ్రమంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీవైకుంఠ నాద సన్నిధిలో గత నెల16 నుంచి ధనుర్మాస మహా వ్రతం ప్రారంభించారు. తెల్లవారుజామున తిరుప్పావై సేవతో గోదా కళ్యాణం వరకు ప్రతి రోజు నిత్యం పలు వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ధనుర్మాస వ్రతంలోని 27 రోజున కుడారి ప్రసాద సేవ కార్యక్రమం నిర్వహించారు.
27 గుండిగలతో ప్రసాదం సిద్ధం..
శ్రీరంగనాథస్వామి భర్తగా లభిస్తే 114 సేర్ల పాయసాన్ని నెయ్యిలో మునిగే విధంగా నివేదన చేస్తానని శ్రీ గోదా అమ్మవారు మొక్కుకున్నారు. కానీ ఆమె మొక్కు తీరకుండానే శ్రీగోదా అమ్మవారు శ్రీ రంగనాథునిలో శరీరం ఐక్యం చెందింది. దీంతో ఈ రోజున 114 శేర్ల నేతిలో మునిగిన పాయసాన్ని ఆశ్రమంలో స్వామివారికి నివేదించి భక్తులకు పంచి పెడతారు. సుమారు 27 గుండిగలతో ప్రసాదం సిద్ధం చేశారు. పాయసాన్ని స్వీకరించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. 13న భోగి రోజు గోదా రంగనాథస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఇవీ చూడండి...: ఆలయాలపై దాడులను ఖండించిన శృంగేరీ శారదాపీఠాధీశ్వరులు