కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా తన నివాసంలో మాజీమంత్రి దేవినేని ఉమ 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలకు 5వేల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద భవన నిర్మాణ కార్మికుల నిధి కింద సెస్ రూపంలో ఉన్న నిధులను..వారికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మూసేసిన అన్నా క్యాంటీన్లను తెరచి... చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని దేవినేని డిమాండ్ చేశారు. ధాన్యం, మామిడి, పత్తి, మిర్చి, మల్లె, టమాటా ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలని కోరారు. వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్, ఆక్వా, పౌల్ట్రీ రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు ఇతర అధికారులకు రక్షణ కిట్లను అందించాలని కోరారు. ప్రజా రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేవినేని ఉమ దీక్షకు రాజ్యసభసభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ సంఘీభావం తెలిపారు.
ఇవీ చదవండి: ఆయన చెట్టుకు 'మోదీ' సహా.. వందల రకాల పండ్లు