Development of Defence System Towards Atmanirbhar Bharat by Satish Reddy: రక్షణ రంగం(Defense sector)లో భారత్ అగ్రగామి దిశగా అడుగులు వేస్తోందని కేంద్ర రక్షణ మంత్రి శాస్త్ర సాంకేతిక సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు జి.సతీష్ రెడ్డి(satish reddy) అన్నారు. 2047 నాటికి రక్షణ రంగ పరికరాల తయారీ, ఎగుమతిలో ప్రపంచలోనే భారత్ మొదటి స్థానంలో నిలిచే దిశగా పనిచేయాలని ఆయన కోరారు. విజయవాడలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఏపీ, మాలక్ష్మి గ్రూపు ఆధ్వర్యంలో ప్రముఖ ఇంజనీరు యార్లగడ్డ శ్రీరాములు 20వ ధార్మిక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఇందులో "ఆత్మనిర్భర్ భారత్ దిశగా రక్షణ వ్యవస్థ అభివృద్ధి అనే అంశంపై" సతీష్ రెడ్డి ముఖ్యవక్తగా ప్రసంగించారు.
బూస్టర్ క్షిపణి పరీక్ష సక్సెస్.. శత్రు యుద్ధవిమానాలకు చుక్కలే!
Central Defence Minister Satish Reddy Visits Vijayawada: మేక్ ఇన్ ఇండియా స్థాయి నుంచి మేక్ ఫర్ ది వరల్డ్ స్థాయికి ప్రస్తుతం చేరుకున్నామని సతీష్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది విదేశాలకు రూ.16 వేల కోట్లు ఎగుమతులు చేశామని అన్నారు. 1958లో డీఆర్డీఓ (DRDO)ను ప్రారంభించిన నాటి నుంచి క్రమంగా ఎదుగుతూ... విక్రమ సారాబాయి, హోమిజేబాబా, అబ్దుల్‌కలాం వంటి గొప్ప శాస్త్రవేత్తల కృషితో నేడు దేశానికి అవసరమైన రక్షణ రంగ పరికరాలను సొంతంగా తయారు చేసుకునే స్థాయికి ఎదిగామన్నారు.
"ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా(Make in india ) పాలసీతో దేశవిదేశాలకు చెందిన అగ్రసంస్థలు మన దేశానికి వచ్చి పరిశ్రమలు స్థాపించాయన్నారు. క్షిపణులు సహా రక్షణరంగ ఆయుధాల తయారీకి ఉపయోగించే 90 శాతం పరికరాలను దేశంలోనే సొంతంగా తయారు చేసుకోవడం గొప్ప పరిణామమని తెలిపారు. యుద్ధట్యాంకులు, విమానాలు, రాడార్లు, జలాంతర్గాములు, టార్బెడోలు, అధునాతన తుపాకులు సహా అన్నింటికీ మనమే తయారు చేసుకుని,చుట్టు పక్కల మన మిత్రదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు".
2014 తర్వాత రక్షణ రంగంలో గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని సాధించగలిగామని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 18 వేల రక్షణ రంగ ప్రైవేటు పరిశ్రమలు ఉన్నాయని.. క్షిపణులు, బాంబుల తయారీలోనూ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ ప్రగతిలో యువత భాగస్వామ్యం ఎనలేనిదని, 2016 ముందు కేవలం 400 స్టార్టప్ కంపెనీలు(startup company) ఉంటే.. ఇప్పడు వాటి సంఖ్య అన్ని రంగాల్లో కలిపి లక్షకు పైగా ఉండటం గర్వకారణమన్నారు. అతి చిన్న వయసులోనే వందల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలను యువతే నడుపుతున్నారని, వారి ఆవిష్కరణలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయన్నారు. గతంలో ఐఐటీల్లో చదివే విద్యార్థుల్లో 90శాతం మంది విదేశాలకు వెళ్లేవారని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. 75 శాతం మందికి పైగా ఇక్కడే ఉండి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని వ్యక్తం చేశారు. ప్రపంచంలో 90 లక్షల యాప్‌లు ఉంటే వాటిలో పది లక్షలకు పైగా భారతదేశంలో తయారైనవేనన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఏపీ శాఖ అధ్యక్షులు డాక్టరు సి.వి.శ్రీరామ్, మా లక్ష్మి గ్రూపు అధినేత యార్లగడ్డ హరిశ్చంద్రప్రసాద్, సంస్థ సీఈఓ సందీప్ తదితరులు పాల్గొన్నారు.
డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు ...సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారుచేశాం!