కాంక్రీటు కొట్టుకుపోయిన రోడ్డు... ప్రమాదకరంగా బయటపడిన ఇనుప చువ్వలు.. అడుగుకో గొయ్యి... ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం నివారించలేని ప్రదేశం..... గోతుల్లో చక్రం పడి అదుపు తప్పుతున్న బతుకుబళ్ల సజీవసాక్ష్యం విజయవాడ వన్‌టౌన్‌లోని చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్. విజయవాడ మీదుగా వెళ్లే NH-16, NH-65లను నగరం వెలుపల నుంచి ఇన్నర్‌రింగ్ మార్గంలో అనుసంధానించే అతి ముఖ్యమైన ఫ్లైఓవర్ దుస్థితి ఇది. ఈ రెండు జాతీయ రహదారుల మీద వెళ్లే ట్రాఫిక్ భారం అంతా ఈ ఒక్క ఫ్లైవోవరే మోయటంతో .. రోడ్డు నాశనమైంది. ఇనుప ఊచలు ఊడొచ్చాయి. మార్గమంతా గోతులు పడ్డాయి. రెండేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ పట్టించుకునే అధికారులు లేక పరిస్థితి మరింత దిగజారింది. ఇనుప చువ్వలు గుచ్చుకుని టైర్లు పాడవుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు..
ఆర్ అండ్ బీ, రైల్వేశాఖ సంయుక్తంగా నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఐదేళ్లలోనే ఈ స్థితికి చేరుకుంది. విజయవాడ నగర పాలక సంస్థకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని R అండ్ B చెబుతుంటే.. అది తమ బాధ్యత కాదంటూ నగరపాలక సంస్థ చెబుతూ వస్తోందని వాహనదారులు ఆరోపించారు. రోడ్డు తక్కువ గోతులు ఎక్కువగా ఉండటంతో... ఎంత ప్రయత్నించినా ఇబ్బంది పడకుండా వెళ్లటం వాహనదారులకు పెద్ద పరీక్షగా మారింది. కడ్డీలు తగిలి వాహనాలు అదుపు తప్పుతున్నాయి. వీటిపై పడి పలువురు తీవ్రంగా గాయపడిన ఘటనలు ఉన్నాయి.
ఫ్లైఓవర్‌పై ప్రయాణ కష్టాలు తీర్చండంటూ పలుమార్లు ఆందోళన చేశామని, ప్రజా ప్రతినిధులు, అధికారులను కలసి ఎన్ని విన్నపాలు చేసినా మరమ్మతులకు మోక్షం కలగలేదని వాహనదారులు వాపోయారు.
ఇదీ చూడండి. వైకాపా నేతలు ఒత్తిడి తెస్తున్నారు...సీఎం జోక్యం చేసుకోవాలి: జీవీఎల్