ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించినప్పటికీ.. రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రూ. 2,29,779.27 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రాభివృద్ధి, పారిశ్రామిక బలోపేతానికి ప్రాధాన్యత ఇవ్వలేదని తెలిపారు. దీని ప్రభావంతో భవిష్యత్ తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయని తెలిపారు. బడ్జెట్ సమావేశాలకు ఒక్కరోజే చర్చకు ఆస్కారం కల్పించడం తగదన్నారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా, అధికార పక్షమే చర్చను ఏకపక్షంగా నిర్వహించడం అసాధారణమని పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాల రూపకల్పనలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల అభిప్రాయాలను, రాజకీయ పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకోలేదని విమర్శించారు.
రాష్ట్ర విభజన అనంతరం మెరుగైన వైద్యసదుపాయాలు రాష్ట్రంలో కనుమరుగయ్యాయన్నారు. విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించడం పట్ల రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఎంతో మంది త్యాగాలు, ఉద్యమ ఫలితంగా ఏర్పాటైన విశాఖ స్టీలు ప్లాంట్ను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
ఇదీ చూడండి.