కృష్ణా జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకు పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వైరస్ ఉద్ధృతిని చూసి నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. గత 48 గంటల ఫలితాలను పరిశీలిస్తే నిన్న, ఇవాళ్టి హెల్త్ బులిటెన్‌లలో కొత్తగా 13 కేసులు చొప్పున నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 236కి చేరింది.
గత ఐదు రోజుల్లో 120 కేసులు విజయవాడ నగరంలోనే నమోదయ్యాయి. నగర పరిధిలోని రెడ్‌జోన్ ప్రాంతాల్లోనే ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయి. గన్నవరం మండలం సూరంపల్లిలో కొత్తగా రెండు కేసులు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు చికిత్స పొందుతున్న వారిలో కోలుకున్న 32 మందిని డిశ్చార్జ్ చేశారు. 196 కేసులు యాక్టివ్‌గా ఉండటంతో ఆయా బాధితులకు వైద్యం అందిస్తున్నారు.
కొత్త కేసులు
ఈరోజు కొత్తగా నమోదైన 13 కేసుల్లో ఇద్దరు మహిళలున్నారు. తాజాగా ప్రకటించిన కేసుల్లో కృష్ణలంక పరిధిలో ఆరు, రామవరప్పాడు, వైఎస్ఆర్ కాలనీ, అజిత్‌సింగ్ నగర్, చిట్టినగర్, క్రీస్తురాజపురం, భవానీపురం, సూరంపల్లిలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. కృష్ణలంక పరిధిలో వచ్చిన కేసుల్లో గుర్రాల రాఘవయ్య వీధిలో వారికి ఎక్కువగా ఉంటున్నాయి. 13 ఏళ్ల బాలుడికి కూడా పాజిటివ్ వచ్చింది.
ఇప్పటివరకూ పాజిటివ్ కేసులొచ్చిన ప్రాంతాలు
కృష్ణా జిల్లా వ్యాప్తంగా విజయవాడ నగరంలోనే ఎక్కువ కేసులు నమోదు కావడానికి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ జనాభా నివాసం ఉండడం వల్లే వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. మొత్తం 62 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోనే 15 లక్షల మంది విజయవాడలో నివాసం ఉంటున్నారు. విజయవాడ గ్రామీణ ప్రాంతంలోని జక్కంపూడి, గొల్లపూడి, పాతపాడు, అంబాపురం.... గన్నవరం మండలం సూరంపల్లిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెనమలూరు మండలం యనమలకుదురు, చోడవరం, కానూరు సనత్‌నగర్, ఆటోనగర్, కంకిపాడు మండలం మంతని, ముసునూరు మండలం గోపవరం, నూజివీడు, నందిగామ మండలం రాఘవాపురం చందర్లపాడు మండలం ముప్పాళ్ల, జగ్గయ్యపేట, మచిలీపట్నం పట్టణంతో సహా చిలకలపూడి ప్రాంతంలోనూ ఇప్పటివరకు పాజిటివ్ కేసులు వచ్చాయి.
లాక్‌డౌన్ నిబంధనలు కఠినతరం
రెడ్‌జోన్ ఏరియాల్లో లాక్‌డౌన్ నిబంధనలను అధికారులు కఠినతరం చేశారు. ఉదయం 6నుంచి 9 గంటల వరకు మాత్రమే ఇళ్ల నుంచి బయటకు అనుమతిస్తున్నారు. అనవసరంగా బయటకొచ్చే వారిని పోలీసులు నేరుగా క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. వాహనదారుల వాహనాలను స్వాధీనం చేసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి తీసుకుంటోన్న కఠినమైన చర్యలతో ప్రధాన రహదారులతోపాటు వీధుల్లో తిరిగే జనసంచారం కొంతవరకు తగ్గింది.