కరోనా కేసులు వచ్చిన చోటే మళ్లీ వస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో కేసుల సంఖ్య తక్కువగా ఉంటున్నాయి. ఈనెల 1 నుంచి గత వారం వరకూ వచ్చిన కేసులు పరిశీలిస్తే.. ఇందులో 95శాతం కట్టడి ప్రాంతాల్లోనే వచ్చాయి. రాష్ట్రంలో 5,700 వరకూ కట్టడి ప్రాంతాలు ఉండగా... కృష్ణా జిల్లాలో గరిష్ఠంగా 640, తూర్పు గోదావరి జిల్లాలో 629 ఉన్నాయి. కనిష్ఠంగా అనంతపురం జిల్లాలో 180, విజయనగరం జిల్లాలో 203 చొప్పున కట్టడి ప్రాంతాలు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ రికార్డులు చెబుతున్నాయి. కృష్ణా జిల్లాలో ఈనెల 1 నుంచి గతవారం వరకూ 5,554 కేసులు నమోదుకాగా వాటిల్లో 95శాతం అంతకుముందు వచ్చిన ప్రాంతాల్లోనివే కావడం గమనార్హం. కొత్త ప్రాంతాల్లో కేవలం 4.9 శాతం అంటే 287 కేసులు మాత్రమే నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 8,775 కేసులు నమోదైతే కొత్త ప్రాంతాల్లో కేవలం 428 అంటే... 4.7 శాతం మందికే కరోనా సోకింది.
విజయవాడలోని వటౌన్, చిట్టినగర్, కృష్ణలంక, మాచవరం, కానూరు, గొల్లపూడి ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అనంతపురం జిల్లాలో అనంతపురం, తాడిపత్రి, పుట్టపర్తి, కదిరి, ధర్మవరం, యాడికి ప్రాంతాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. కర్నూలు నగరంలో వన్ టౌన్, పాతబస్తీ చుట్టుపక్క ప్రాంతాల్లోనే కేసులు వస్తున్నాయి. విశాఖలోని వ్యాపగుంట, చిన్న ముసిడివాడ, గాజువాక, గోపాలపట్నం, తదితర ప్రాంతాలు, ఒంగోలు నగరంలోని తూర్పుకమ్మపాలెం, కొత్తపట్నం బస్టాండ్ పరిసరాల్లో వైరస్ విజృంభణ అధికంగా ఉంది.
కేసులు అధికంగా ఉన్నచోట స్థానికులు అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనా కట్టడిపై నేడు సమీక్ష.. అనంతరం బెంగళూరుకు సీఎం