రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రివర్గం నుంచి గవర్నర్ తక్షణమే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను అధికారులు పాటిస్తే బ్లాక్ లిస్ట్‌లో పెడతామని మంత్రి హెచ్చరించారని తులసిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి ఎన్నికల కోడ్‌ను అతిక్రమిస్తూ.. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించాలని అన్నారు.
జగన్ పాలనలో రాయలసీమకు అడుగడుగునా అన్యాయమే జరిగిందని విమర్శించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు విశాఖలో పెట్టాలనుకోవడం మూర్ఖత్వమని తెలిపారు. బోర్డు కార్యాలయాన్ని శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇంటి వద్దకే రేషన్ బియ్యం పథకం ఓ పిచ్చి తుగ్లక్ చర్య అని తులసిరెడ్డి విమర్శించారు. దీనివలన వాహనదారులు, వినియోగదారులకు ఎవరికీ ప్రయోజనం లేదని అన్నారు. పాత రేషన్ పద్ధతినే పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేత డిమాండ్ చేశారు.