ఇంగ్లండ్‌లో వెలుగు చూసిన కరోనా కొత్తరకం స్ట్రెయిన్‌పై జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. బ్రిటన్ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన ఓ మహిళకు కరోనా నిర్ధరణ అయిందన్నారు. ఆమెతో పాటు నలుగురు కృష్ణాజిల్లా వాసులు రైలులో ప్రయాణించినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం ఆ నలుగురు మచిలీపట్నంలో ఉన్నట్లు గుర్తించి.. వారికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించామన్నారు. రిపోర్టులు వచ్చిన వెంటనే తదుపరి చర్యలు చేపడతామన్నారు.
ప్రస్తుతం వారిని క్వారంటైన్లో ఉంచినట్లు తెలిపారు. కరోనా వైరస్‌లో 17 రకాలు జన్యుమార్పిడి చెందిందని వైద్య నిపుణులు తెలిపారన్నారు. ప్రస్తుతం ఉన్న స్ట్రెయిన్ ను ఎన్ 501వైగా పిలుస్తున్నారని కలెక్టర్ తెలిపారు. 501 పాయింట్ వద్ద అమినో యాసిడ్ మారిపోయి మరో అమినో యాసిడ్ ఏర్పడుతున్నట్లు గుర్తించారని ఇంతియాజ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలిసిన సమాచరాం ప్రకారం ఈ తరహా స్ట్రెయిన్ వ్యాప్తి 75 శాతం ఉంటుందని తెలుస్తుందన్నారు.
నవంబర్ 25 నుంచి డిసెంబర్ 21 వరకు ఇంగ్లండ్ నుంచి జిల్లాకు వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. 116 మంది జిల్లాకు వచ్చారని వారి వివరాలు సేకరించి కరోనా నిర్దరణ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు కరోనా నిర్ధరణ పరీక్ష చేయించాలని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం అధికారులతో సమావేశమై నిర్ధరణ పరీక్షలు , కరోనా వ్యాప్తి జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్చించామన్నారు.
ఇదీ చదవండి: ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్ధం.. ప్రారంభించనున్న సీఎం జగన్