cm jagan on agri infra: అగ్రి ఇన్‌ఫ్రాపై సీఎం జగన్ సమీక్షించారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను పెంచే దాదాపు 15 రకాల ప్రాజెక్టుల ప్రగతిపై అధికారులతో చర్చించారు. వీటికి సంబంధించిన నిధుల సేకరణ, టై అప్‌లపై చర్చించిన ముఖ్యమంత్రి.. దాదాపు 16 వేల 320 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టుల్లో గణనీయ పురోగతి కనిపించాలని సీఎం ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా వీటిని రైతులకు, అనుబంధ రంగాలకు అందుబాటులోకి తీసుకురావాలని, తద్వారా రైతులకు అదనపు ఆదాయాలు లభించేలా చూడాలన్నారు. గోదాములు సహా అన్నిరకాల నిర్మాణాలు ఊపందుకోవాలన్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాల ద్వారా వచ్చిన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతుల్లో అవగాహన పెంచడం ద్వారా అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఏడాదిలో ప్రతి ఆర్బీకే కేంద్రంలో సేంద్రీయ వ్యవసాయం కోసం కస్టం హైర్ సెంటర్ రావాలని సీఎం ఆదేశించారు. సేంద్రీయ, సహజ వ్యవసాయం చేయడానికి అవసరమైన యంత్రాలు, పరికరాలను ప్రతి ఆర్బీకే కేంద్రంలో ఏర్పాటు చేయాలన్నారు. సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేసే వాటికి మంచి రేటు వచ్చేలా చూడాలని తెలిపారు. అలాంటి ఉత్పత్తులు చేస్తున్న రైతులకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేలా ఒక విధానం తీసుకురావాలని సూచించారు.
గోడౌన్ల నిర్మాణానికి జిల్లాల్లో దాదాపుగా స్థల సేకరణ పూర్తయ్యిందని,1165 చోట్ల గోడౌన్లు నిర్మిస్తున్నామని సీఎంకు అధికారులు తెలిపారు. ఇప్పటికే 278 చోట్ల పనులు మొదలుపెట్టామని వివరించారు. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా మొత్తం 33 చోట్ల విత్తనాలు, మిల్లెట్ ప్రైమరీ ప్రాససింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఖరీఫ్ 2022 నుంచి ఈ ప్రాసెసింగ్ సెంటర్లు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. చిరుధాన్యాలు, పప్పు దినుసులు సాగుచేస్తున్న రైతులు ఈ యూనిట్లను చక్కగా వినియోగించుకోవచ్చని చెప్పారు. ప్రాసెస్ చేయడతో రైతులకు మంచి ధరలు లభిస్తాయని, నాణ్యమైన ఉత్పత్తులు ఉంటాయన్నారు.
'పాలవెల్లువ'పై సీఎం సమీక్ష..
cm review on jagananna pala velluva: జగనన్న పాలవెల్లువ కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. పశువుల కోసం 175 అంబులెన్స్‌లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేశామని వివరించారు. మార్చి నెలలలో పశు అంబులెన్సులు ప్రారంభించాలని నిర్ణయించారు. దాదాపు 1100 గ్రామాల్లో పాల సేకరణ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. నెలకు 28 లక్షల 502 లీటర్లకు పైగా పాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకూ 2.03 కోట్ల లీటర్లకుపైగా సేకరణచేసినట్లు వివరించారు. రైతులకు 86.58 కోట్ల చెల్లింపులు జరగ్గా.... రైతులకు అదనంగా 14.68 కోట్లు లబ్ది చేకూరినట్లు పేర్కొన్నారు. తూనికల్లో తేడాలు, ఫ్యాట్ నిర్ధరణలో తప్పిదాలకు పాల్పడుతున్న వారిపై కేసులు బుక్ చేశామని తెలిపారు. వచ్చే నెలలో విశాఖపట్నం జిల్లాలో అమూల్ పాలసేకరణ ప్రారంభించినట్లు తెలిపారు. చిత్తూరు, కృష్ణ, విశాఖపట్నంలో పాల ఉత్పత్తుల యూనిట్లను ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. జూన్ నాటికి 70 ఆక్వాహబ్‌లు, 14వేల స్పోక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. సత్వరమే వీటిని పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి :
సినిమా టికెట్ల ధరల వివాదం.. జగన్, చిరంజీవి భేటీ వ్యక్తిగతం: మంచు విష్ణు