Review of CM YS Jagan : వ్యవసాయ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. రబీ సీజన్ ధాన్యం సేకరణ చేయడానికి ఏప్రిల్15 నుంచి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టంపై నమోదు స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. ఎన్యుమరేషన్ జరుగుతోందని, ఏప్రిల్ మొదటి వారంలో నివేదిక ఖరారుచేస్తామని అధికారులు తెలిపారు. ఏప్రిల్ రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదల చేస్తామని వివరించారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు.
నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు.. రబీలో నాణ్యతలేని ఎరువులు, పురుగుమందులు, కల్తీ ఎరువులు, కల్తీ పురుగు మందులు లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులతో పాటు, పురుగు మందుల పంపిణీపై పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఏ మాత్రం పొరపాట్లు జరిగినా రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున మరింత శ్రద్ధ పెట్టాలని సీఎం ఆదేశించారు. ఆర్బీకేల ద్వారానే నాణ్యమైన ఎరువులను పంపిణీ చేస్తున్నామని, ఈ ఏడాది 10.5లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
పరికరాల పంపిణీ... రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. యాంత్రీకరణ పెరిగేందుకు దోహదపడుతుందిని.. 4225 సీహెచ్‌సీలకు యంత్రాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. ముందుగా జులైలో 500, డిసెంబర్ కల్లా మూడు విడతల్లో 1500 డ్రోన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. జులైలో టార్పాలిన్లు, డిసెంబర్ లోగా మూడు విడతలుగా స్ప్రేయర్లు పంపిణీ చేయాలని సూచించారు.
మిల్లెట్ సాగుపై... రాష్ట్రంలో మిల్లెట్స్ సాగును ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. 19 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున మిల్లెట్ క్లస్టర్లు పెట్టామని అధికారులు తెలిపారు. 3 ఆర్గానిక్ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఎగుమతికి ఆస్కారం ఉన్న వరి సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. 2022 ఖరీఫ్‌లో 2.74 లక్షల హెక్టార్లలో ఎగుమతి చేయదగిన వరి రకాలను సాగుచేస్తున్నామన్న అధికారులు... దాదాపు 6.29 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యిందని వెల్లడించారు. 2022–23 రబీలో 1.06 లక్షల హెక్టార్లలో ఎగుమతి వెరైటీలను సాగుచేశారని, 3.79 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉందని అధికారులు వెల్లడించారు. ఉద్యాన పంటల మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. కొత్త తరహా ఉత్పత్తులు వస్తున్నకొద్దీ.. మార్కెటింగ్ ఉధృతంగా ఉండాలన్న సీఎం... దీనివల్ల రైతులు తమ పంటలను విక్రయించుకోవడానికి ఇబ్బందులు ఉండవని, మంచి ఆదాయాలు వస్తాయన్నారు.
ప్లాంట్ డాక్టర్... ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. భూ పరీక్షకోసం నమూనాల సేకరణ, వాటిపై పరీక్షలు, వాటి ఫలితాలను రైతులకు అందించడం, ఫలితాలు ఆధారంగా పాటించాల్సిన సాగు విధానాలపై అవగాహన తదితర అంశాలపై ఒక సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించుకోవాలన్నారు. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఖరీఫ్ నాటికి పరీక్షల ఫలితాలు వెల్లడించి వాటి ఆధారంగా సాగులో పాటించాల్సిన పద్ధతులపై రైతులకు పూర్తి వివరాలు, అవగాహన కల్పించాలన్నారు. పంటలకు అవసరమైన స్థాయిలోనే ఎరువులు, పురుగుమందులు ఉండాలన్నారు. ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్... ఆర్బీకేల కార్యక్రమాలను ఒక దశకు తీసుకెళ్తాయన్నారు.
ఇవీ చదవండి :