ఎల్బీ స్టేడియంలో జరిగిన బల్దియా ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై తన వైఖరిని స్పష్టంచేశారు. జరుగుతున్నవి మున్సిపల్ ఎన్నికలా లేక జాతీయ ఎన్నికలా అని కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో కొత్త పంథా రావాలని ప్రశ్నించినందుకు... దిల్లీలో గజగజ వణుకుతున్నారని... ఆపేందుకు నేతలు వరదలా వస్తున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారని... అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో బేరీజు వేసుకోవాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు. నగర ప్రశాంతతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న కేసీఆర్... బీపాస్ కావాలా, కర్ఫ్యూ పాస్ కావాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ ప్రశాంతతను కాపాడుకోవాలి
బల్దియా ప్రచారంలో విపక్షాలు తనను తూలనాడుతున్నప్పటికీ సంయమనం పాటిస్తున్నానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజలే తమకు బాసులన్న ఆయన... తాము ఎవరికీ భయపడబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రశాంతతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్ననారు. మేధావులు, వర్తక, వ్యాపారులు, ప్రొఫెషనల్స్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడిన వారు బాధ్యతగా ముందుకు రావాలని సూచించారు. మంచి అభ్యర్థులను బరిలో దింపామన్న సీఎం... గతం కంటే మరో నాలుగు సీట్లు ఎక్కువగానే వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫలితాల అనంతరం ఎల్బీ స్టేడియం వేదికగానే సంబురాలతో హైదరాబాద్ భవిష్యత్ ప్రణాళికను ఆవిష్కరించుకుందామని అన్నారు.
ఇదీ చదవండి: జోరుమీదున్న భాజపా... రంగంలోకి అమిత్ షా