Southern zonal council meeting: రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, సెప్టెంబరు 3న తిరువనంతపురంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో వాటి గురించి గట్టిగా ప్రస్తావించాలని సీఎం జగన్ సూచించారు. ప్రాంతీయ మండలి సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై ఆయన సోమవారం తాడేపల్లిలో మంత్రులు, అధికారులతో సమీక్షించారు. తన తండ్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున, ప్రాంతీయ మండలి సమావేశానికి తాను హాజరవడం లేదని సీఎం చెప్పారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రతినిధుల బృందం సమావేశానికి హాజరవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ తరపున ప్రతిపాదించిన వాటిలో 19 అంశాలను సమావేశం అజెండాలో చేర్చారని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. విభజన సమస్యల్ని సమావేశంలో ప్రస్తావిస్తూ, వాటికి పరిష్కారం సూచించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా కోరాలని సీఎం సూచించారు.
ఆ వ్యవస్థ కేవలం పరిష్కారాలు చూపించడమే కాకుండా, తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేదిగా ఉండాలని గట్టిగా డిమాండ్ చేయాలని సీఎం పేర్కొన్నారు. విభజన వల్ల రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్ వంటి నగరాన్ని కోల్పోయిందని, విభజన సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతున్న కొద్దీ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆయన తెలిపారు. అందుకే వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిందిగా సమావేశంలో గట్టిగా ఒత్తిడి తీసుకురావాలని జగన్ కోరారు. పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేయడానికి తగిన నిధులు విడుదల అంశాన్ని కూడా అజెండాలో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో విద్యుత్, ఆర్థిక శాఖల మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: