సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ నారాయణరెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సకాలంలో పూర్తి చేయాలి..
పోలవరం, వెలిగొండ, అవుకు ప్రాజెక్టుల పనుల పురోగతిని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్ –2 పనుల్లో జాఫ్యం లేకుండా కొనసాగించాలని నిర్దేశించారు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్, కాలువలుకు సంబంధించి పనుల పురోగతిని వివరించిన అధికారులు.. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, నిర్ణీత వ్యవధిలో పూర్తవుతుందని పేర్కొన్నారు.
గ్రావిటీ ద్వారా పరిశీలించాలి..
పోలవరం ప్రాజెక్టు అప్రోచ్, స్పిల్ ఛానెల్ పనులు మే నాటికి పూర్తి చేయాలని.. అంతకుముందే కాఫర్ డ్యాం పనులు కూడా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పోలవరం నుంచి విశాఖపట్నానికి తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రత్యేక పైప్‌లైన్ ఏర్పాటు చేయాలన్నారు. ఎలాంటి పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ఏర్పాటును పరిశీలించాలని, తద్వారా పవర్ వినియోగం లేకుండా చూడాలన్నారు.
బ్యాక్ వాటర్‌తో సమస్యలు రాకూడదు..
పోలవరం ప్రాజెక్టులో నీరు 41.15 అడుగుల స్థాయికి చేరినప్పటికీ.. బ్యాక్ వాటర్‌తో ఎక్కడా సమస్యలు రాకూడదని, ఇబ్బందులు తలెత్తకుండా భూసేకరణ, ఆర్అండ్ఆర్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో నిర్వాసితులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
దానికి నెలవారీగా నిధులు విడుదల..
ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులపై సీఎం సమీక్ష జరిపారు. ప్రాజెక్టులోని మొదటి సొరంగం పనులు దాదాపు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. రెండో సొరంగం పనులు ఆగస్టు నాటికి పూర్తి చేసి రెండు టన్నెల్స్ ద్వారా నీరు అందిస్తామని సీఎంకు వివరించారు. దీనికి భూసేకరణ, ఆర్అండ్ఆర్ కోసం నెలవారీ ప్రణాళిక మేరకు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
మార్చి నాటికి పూర్తి చేస్తాం..
అవుకు టన్నెల్ –2లో మిగిలిన 137 మీటర్లు సొరంగం పనిని మార్చి నాటికి పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి మొత్తంగా 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తామని వివరించారు. అవుకు మూడో టన్నెల్‌కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ దాదాపుగా పూర్తైందని అధికారులు వివరించారు. సాధ్యమైనంత త్వరగా పనులు సైతం ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
'రాయలసీమ' లోగోకు సీఎం ఓకే..
రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టు పనుల కోసం ఎస్పీవీ రిజిస్ట్రేషన్ పూర్తైందని తెలిపిన అధికారులు లోగోను సీఎంకు చూపించారు. అంగీకరించిన సీఎం తదుపరి చర్యల కోసం ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు.
చిత్రావతిలో 20 టీఎంసీలు నిల్వ చేయాలి..
చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో తొలిసారి పూర్తి సామర్థ్యం మేరకు 10 టీఎంసీల నీటిని నింపి.. రైతులకు నీరు విడుదల చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గండికోటలో కూడా ప్రస్తుత నీటి నిల్వ 18 టీఎంసీలు ఉందని, గతంలో కంటే అధిక స్ధాయిలో నిల్వ చేయగలిగామని సీఎంకు వివరించారు. మొత్తంగా 20 టీఎంసీల వరకు నీరు నిల్వ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.