కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని స్వదేశాలకు రప్పించేందుకు మరిన్ని విమానాలు నడపాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రానికి లేఖ రాశారు. వందే భారత్ మిషన్లో భాగంగా ఏపీకి ప్రత్యేక విమానాలు నడపాల్సిందిగా సీఎం జగన్... విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ను కోరారు. లేదా ఆయా దేశాల నుంచి నేరుగా ఏపీకి ఛార్టడ్ విమానాలను అనుమతించాల్సిందిగా సీఎం తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
కిర్గిస్తాన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సింగపూర్ దేశాల్లో తెలుగు వారు ఎక్కువ మంది స్వస్థలాలకు రాలేకపోయారని.. వారంతా తిరిగి వచ్చేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలను నడపాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. ఆయా దేశాల్లోని ప్రవాసాంధ్రుల సంఘాలు ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించాయని.. కనీసం ఛార్టడ్ విమానాలనైనా ఏపీకి అనుమతించేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిని సీఎం లేఖలో కోరారు. ఆంధ్రప్రదేశ్లోని ఏ అంతర్జాతీయ విమానాశ్రయంలోనైనా ఈ ఛార్టడ్ విమానాలు దిగేందుకు అనుమతిస్తే కేంద్ర నిబంధనలకు అనుగుణంగానే వారిని స్వస్థలాలకు పంపుతామని సీఎం పేర్కొన్నారు. వందే భారత్ కార్యక్రమాన్ని ఎక్కువ మంది ప్రవాసాంధ్రులు వినియోగించుకోలేకపోయారని సీఎం లేఖలో వెల్లడించారు.
ఇదీ చదవండి