సీపెట్ శాశ్వత భవనాలను కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానంద్ గౌడతో కలిసి ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించనున్నారు. 2016 నుంచి విజయవాడ న్యూ ఆటోనగర్‌లోని తాత్కాలిక భవనాల్లో సేవలందించిన సీపెట్... నేటి నుంచి గన్నవరం మండలం సూరంపల్లి శాశ్వత భవనాల్లో సేవలందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక హంగులతో భవనం నిర్మాణం చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న సీపెట్ సంస్థల నిర్మాణాలలో విజయవాడ సంస్థ అగ్రగామిగా నిలుస్తుందని డైరక్టర్ వి . కిరణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది నుంచి జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తామన్నారు.
శాశ్వత భవనం నిర్మాణ దశలో ఉన్నప్పుడే విజయవాడలో సీపెట్ కార్యకలాపాలు ప్రారంభించింది. డిప్లొమా కోర్సులతోపాటు ప్లాస్టిక్ ఇంజనీరింగ్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి సాంకేతికంగా సహకారం అందిస్తుంది. తాత్కాలిక భవనాల్లో ఏడాదికి సుమారు 1500 మందికి శిక్షణ ఇచ్చామని...శాశ్వత భవనాల్లో 5000 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యమని సంస్థ డైరెక్టర్ తెలిపారు.
పారిశ్రామికంగా ఏ రంగం చూసినా ప్లాస్టిక్‌తోనే ముడిపడి ఉంది. అందువల్ల నానాటికీ ప్లాస్టిక్ రంగం అభివృద్ధి చెందుతోంది. ప్లాస్టిక్ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికే కాకుండా ఉపాధి కల్పించడంలోనూ కీలక భూమిక పోషించనుంది.
ఇవి కూడా చదవండి: