ముద్దుముద్దు మాటలతో, బుడిబుడి అడుగులతో అప్పటిదాకా సందడి చేసిన చిన్నారి అంతలోనే విగతజీవిగా మారింది. అపార్ట్‌మెంట్ రెండో అంతస్తు పైనుంచి ప్రమాదవశాత్తూ కిందపడి బిడ్డ దుర్మరణం పాలవడంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసుల కథనం ప్రకారం.. గట్టెం బాలరాజు, రమణి దంపతులు తాడిగడప యనమలకుదురు సాయినగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ కింది అంతస్తులో నివసిస్తున్నారు. వారికి మూడేళ్ల కుమారుడు, ఏడాదిన్నర కుమార్తె నేహానందసాయి ఉన్నారు.
బుధవారం ఉదయం తల్లి ఇంటి పనిలో నిమగ్నమవగా.. తండ్రి ఆటోనగర్‌లోని తన దుకాణానికి వెళ్తూ కుమార్తెను అదే అపార్ట్‌మెంట్ రెండో అంతస్తులో నివసిస్తున్న తాత ఈశ్వరరావు వద్ద విడిచి పెట్టారు. కాసేపటి తర్వాత నేహా ఆడుకుంటూ బయటకు వచ్చింది. గ్రిల్స్‌లో నుంచి కిందకు చూస్తూ ప్రమాదవశాత్తు పడిపోయింది. కుటుంబసభ్యులు వెంటనే పాపను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా కొద్ది సేపటికే మృతి చెందింది.
చిన్నారి బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. అపార్ట్‌మెంట్ వరండాలో ఏర్పాటు చేసిన గ్రిల్స్‌కు నడుమ ఖాళీ ఎక్కువగా ఉండడంతో పాప అందులో నుంచి కిందపడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: