పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా వైకాపా నేతలు అడ్డుపడ్డారని కృష్ణా జిల్లా కందులపాడుకు చెందిన పొందుగుల చిలకమ్మ ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. నామినేషన్ల సమయం ముగిసేవరకూ సాక్షులను కార్యాలయంలోకి రానివ్వలేదని పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేయవద్దని వైకాపా వ్యక్తులు తనను బెదిరించారని అన్నారు. తెదేపా నేతలతో కలిసి విజయవాడలో ఎస్ఈసీ కార్యాలయానికి వెళ్లిన చిలకమ్మ.. నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని కోరారు.
మాజీ కార్పొరేటర్లను భయపెడుతున్నారు..
విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని తెదేపా సానుభూతిపరుల ఒట్లను తొలగిస్తున్నారని ఎన్నికల సంఘానికి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసులు బైండోవర్ల పేరిట మాజీ కార్పొరేటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. వైకాపా అభ్యర్థుల విజయం కోసమే కొందరు పోలీసులు పాటు పడుతున్నారని బొండా ఉమ ఆరోపించారు. తెదేపా నేతలే లక్ష్యంగా వేధిస్తున్నారని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరగా.. ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: 'కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉంది'