CM Jagan Review : వైద్య ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై సమీక్షించిన సీఎం... కీలక ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది లేరనే మాట రాకూడదని, క్రమం తప్పకుండా ఆడిట్ చేయాలని స్పష్టం చేశారు. ప్రతి ఆస్పత్రినీ ఒక యూనిట్‌గా తీసుకుని.. విలేజ్ క్లినిక్ నుంచి బోధనాసుపత్రి వరకూ ఈ ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేశారు. అవసరమైన మేరకు ఉండాల్సిన డాక్టర్లు, నర్సులు.. ఇతరత్రా సిబ్బంది ఎక్కడ ఖాళీగా ఉన్నా గుర్తించి వెంటనే భర్తీ చేయాలని నిర్దేశించారు. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని, సరిపడా సిబ్బంది ఉంటే సగం సమస్యలు సమసిపోతాయని అన్నారు. దీంతోపాటు మౌలిక సదుపాయాలు, మందులు సరిపడా ఉండేలా చూసుకోవాలన్నారు. ఎంతమంది సిబ్బంది ఉన్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపై ప్రతి సమీక్షా సమావేశంలో వివరాలు సమర్పించాలని సీఎం ఆదేశించారు. కోవిడ్ తాజా పరిస్థితులపై సమీక్షించిన సీఎం.. రాష్ట్రంలో పరిస్థితిపై ఆరా తీశారు. కొవిడ్ కేసుల్లో ఏపీ దేశంలో 23 స్థానంలో ఉందని.. 24 మంది మాత్రమే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. టెస్టులు పెంచినట్లు తెలిపారు. ఎయిర్‌పోర్టుల్లో విదేశాల నుంచి వచ్చేవారికి టెస్టులు చేస్తున్నామని తెలిపారు.
నిరంతర పర్యవేక్షణ ఉండాలి.. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని, ఒక గ్రామానికి వెళ్లిన తర్వాత ఎస్‌ఓపీ కచ్చితంగా అమలు కావాలన్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజస్‌తో ఉన్న వారిని గుర్తించి.. వారిపై ప్రత్యేక దృష్టిపెడుతున్నట్లు అధికారులు తెలిపారు. వీరి వివరాలు నమోదు చేసుకుని వారికి ఆరోగ్య సేవలు అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీరు ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వచ్చి వైద్యం తీసుకునేలా నిరంతరం ఫాలో అప్ చేస్తున్నట్లు తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ రాకపై ముందుగానే తేదీలు ప్రకటించి ఆశ కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి జిల్లాల్లో సమర్థులైన అధికారులు ఉండేలా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయాలన్న సీఎం.. ఎవరికి సమస్య ఉన్నా వారికి వెంటనే పరీక్షలు చేయించాలన్నారు. అవసరమైన వారికి కంటి అద్దాలు ఇవ్వాలన్నారు. నెల, రెండు నెలలకోసారి ఈ పరీక్షలు జరగాలన్న సీఎం.. దీనిపై కార్యాచరణ తనకు నివేదించాలని ఆదేశించారు.
గర్భిణులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.. రక్తహీనత, పౌష్టికాహార లేమిని పూర్తిగా నివారించాలని సీఎం ఆదేశించారు. రక్తహీనతతో బాధపడుతున్న గర్భవతులకు తప్పనిసరిగా పౌష్టికాహారం అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. కమ్యూనిటీ హెల్త్‌ఆఫీసర్లను విధి నిర్వహణలో సుశిక్షితులుగా తయారు చేయడానికి ప్రత్యేక కరిక్యులమ్ తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీహెచ్‌సీలలో వారికిచ్చిన వైద్య పరికరాలను వినియోగిస్తున్నారా లేదా అనే విషయాన్ని సమీక్షించాలన్నారు. అందుబాటులోని బోధనాసుపత్రుల్లో వారికి శిక్షణ ఇప్పించాలన్నారు. ఓరల్ హెల్త్‌కేర్, ఈఎన్‌టీ సమస్యలు, వృద్ధాప్యంలో వచ్చే సమస్యలకు వైద్య సేవలు, సీపీఆర్ లాంటి ఎమర్జెన్సీ మెడికల్ సేవలు సహా.. అన్నింటిపైనా శిక్షణ ఇప్పించాలన్నారు. దీంతో పాటు పాముకాట్లకు సంబంధించి వెంటనే చికిత్స అందించేలా వారిని సుశిక్షితులు చేయాలన్నారు.
కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీలలో నాడు – నేడు పనులపై సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2185 మెడికల్ సీట్లకు అదనంగా కొత్త మెడికల్ కాలేజీల కారణంగా 2100 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ విద్యాసంవత్సంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు. తద్వారా 750 సీట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. 2024 –25 విద్యా సంవత్సరంలో మరో 350 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. 2025–26 విద్యాసంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, మదనపల్లె, పెనుకొండ, పాలకొల్లు, మార్కాపురం, నర్సీపట్నం, అమలాపురం, పార్వతీపురం మెడికల్ కాలేజీల్లో తరగతులు నిర్వహించేందుకు కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నారు. తద్వారా మరో 1000 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తున్నాయని అధికారులు తెలిపారు. నిర్దేశించుకున్న కార్యాచరణతో పనులు ముందుకు సాగాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
కార్మికులకు శుభాకాంక్షలు.. మే డే సందర్భంగా కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక సోదరుల శ్రమ అమూల్యమన్న సీఎం.. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కార్మికులే కీలకమని ట్విట్టర్లో మే డే శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చదవండి :