సీఎం జగన్‌కు రాజ భవనాలు కట్టుకోవడం అలవాటని చంద్రబాబు అన్నారు. విశాఖపై వైకాపా కన్నుపడిందని, అందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. జగన్ ప్రజల మనిషి కాదని... వారిని భయభ్రాంతులకు గురి చేసే వ్యక్తి అని విమర్శించారు.
దిల్లీ దృష్టికి...
అమరావతి సమస్యను దేశ నేతల దృష్టికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ చేపడతామని చంద్రబాబు తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి, ఇతర పార్టీలతో చర్చించి ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి రాజధాని సమస్యను తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
5 వేల మందికి ఇళ్లు కట్టిచ్చాం
హైదరాబాద్‌లాంటి మహానగరం కావాలని యువత కోరుకుందని చంద్రబాబు అన్నారు. పెరిగిన భూమి విలువతో రాజధానిలో మహానగరం నిర్మించవచ్చన్న ఆయన.. అమరావతిలో 5వేల మంది పేదలకు ఇళ్లు కట్టిచ్చామని తెలిపారు. అన్నీ భవనాలు నిర్మించిన తర్వాత ప్రభుత్వం వద్ద 10వేల ఎకరాల భూమి ఉంటుందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి పన్నుల రాబడి పెరుగుతుందని అంచనా వేశామన్నారు.
తనపై కోపంతోనే ఇదంతా..
‘‘వైకాపా వ్యాపారాలు, ఆస్తులు పెంచుకునేందుకు కుట్రలు పన్ని రాష్ట్రాన్ని అంధకారం చేయొద్దని చంద్రబాబు సూచించారు. తనపై కోపంతోనే ఇదంతా చేస్తున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉందని స్పష్టం చేశారు. 'అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే సీబీఐకి లేఖ రాయండి. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకోవచ్చు. రైతుల కోసం పోరాడితే మాపై సీబీఐ విచారణ చేస్తారా?. మేం ఏ తప్పూ చేయలేదు.. ఎవరికీ భయపడం. సీబీఐపై గౌరవం ఉంటే ప్రతి శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళ్లట్లేదు.' అని చంద్రబాబు అన్నారు.
ద్వంద్వ వైఖరి...
సొంత పనుల కోసం ఎన్‌ఆర్‌సీకి మద్దతిచ్చిన వైకాపా నేతలు.. ఇప్పుడు వ్యతిరేకమని మాట మార్చారన్నారు చంద్రబాబు. ఇది వైకాపా ద్వంద్వ వైఖరికి నిదర్శనం అని విమర్శించారు. ఎన్‌ఆర్‌సీకి తమ పార్టీ వ్యతిరేకమన్న తెదేపా జాతీయ అధ్యక్షుడు... తమ ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనలేదని గుర్తు చేశారు.
ఇదీ చదవండి :