తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ప్రారంభమయ్యే బుడమేరు... విజయవాడ నగర పరిసరాలైన జక్కంపూడి, నందమూరు, సుబ్బరాజునగర్, ఇందిరానాయక్ నగర్, అజిత్ సింగ్ నగర్, రామకృష్ణాపురం, దేవీనగర్ మీదుగా గుణదల వరకు విస్తరించి ఉంది. 2014కి ముందు...అజిత్ సింగ్ నగర్, పాయకాపురంతోపాటు విజయవాడ వన్‌టౌన్‌లోని పలు ప్రాంతాలు ఏటా బుడమేరు ముంపునకు గురయ్యేవి. ఈ సమస్యకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి...నీరు మళ్లించేందుకు నిధులు కేటాయించి పరిష్కరించారు.
కాలువ పూడ్చేసి ప్లాట్లు
రాష్ట్రం విడిపోయాక రాజధాని విజయవాడ పరిసరాలకు మారడం వలన....అభివృద్ధి వేగం పుంజుకుంది. నగర సరిహద్దులు మారుతూ...శివారు ప్రాంతాలకు విస్తరిస్తుంది. రాజధాని రాకతో స్థలాల ధరలు అమాంతం పెరిగాయి. వీటితో కొందరు అక్రమార్కుల కన్ను బుడమేరుపై పడింది. కాలువను అడ్డగోలుగా పూడ్చేసి ప్లాట్లుగా విభజించి విక్రయాలు ప్రారంభించారు. గజం రూ.15 వేల నుంచి రూ.20 వేలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.
అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పక్కనున్న జియో టవర్ రోడ్డులో... సుమారు రూ.5 కోట్లు విలువ చేసే బుడమేరు స్థలాన్ని కబ్జా చేసి, ప్లాట్లుగా సరిహద్దు రాళ్లు వేశారు. భవన నిర్మాణ వ్యర్థాలను తీసుకొచ్చి కాలువ గట్టుమీద పోయడం... గుట్టుచప్పుడు కాకుండా యంత్రాలతో కాలువను పూడ్చేసే ప్రయత్నాలు చేశారు. ఈ రియల్ దందాతో న్యూ రాజరాజేశ్వరిపేటలో... బుడమేరు ఓ పిల్ల కాలువగా మారింది.
స్థానిక నేతల అండదండలు
భూ మాఫియాకు స్థానిక నేతల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుడమేరు ఆక్రమణలపై స్పందించిన అధికారులు... న్యూ ఆర్ఆర్ పేటలోని సుమారు 1.50 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ ఆక్రమణలపై నీటిపారుదలశాఖ, నగర పాలక సంస్థతో కలిసి చర్యలు తీసుకుంటామన్నారు. కాలువ వెంబడి ప్రత్యేక డ్రైవ్ చేపట్టి... నిర్మాణాలు తొలగిస్తామని వెల్లడించారు.
కబ్జాదారుల కోరల్లో చిక్కి ఆక్రమణలకు గురికాక ముందే ప్రభుత్వం స్పందించి బుడమేరును సంరక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : మూతపడ్డ రాజన్న క్యాంటీన్లు... ఆకలితో పేదలు