రాష్ట్ర సరిహద్దుల్లో పనిచేస్తున్న ప్రత్యేక పోలీసు సిబ్బంది.... దాదాపు 9 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2020లో రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సరిహద్దుల్లో మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసింది. తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గ పరిధిలోని సరిహద్దు చెక్‌పోస్ట్‌ల్లో విధుల కోసం సుమారు 220 మందిని తాత్కాలిక పద్ధతిలో నియమించారు. ప్రారంభంలో జీతాలు ఇచ్చినా, తొమ్మిది నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదు. కుటుంబ ఖర్చులకు అప్పులు చేస్తున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సరిహద్దుల్లో పనిచేస్తున్న సిబ్బంది రోజుకు 12 గంటలు విధులు నిర్వహించటమే కాకుండా మంత్రులు,VIP బందోబస్తు కూడా హాజరవుతున్నారు. ఉద్యోగ భద్రత ఆశతో డిగ్రీ ,పీజీలు చేసిన వాళ్లు ఈ కొలువులో చేరారు. వేతనాలు సరిగా అందకపోవటంతో 50 మంది ఉద్యోగం మానేశారు . ప్రస్తుతం 170 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారులకు విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే జీతాలు అందించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: PARITALA SRIRAM: 'వంగవీటి రాధా జోలికొస్తే ఊరుకోం..'