BJP state president Somu Veerraju comments : ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన నుంచి తగిన సహకారం లభించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పరోక్షంగా వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శోభకృత్ నామ ఉగాది వేడుకల అనంతరం వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు జనసేన నుంచి అందిన సహకారం ఎంత అనేది మీరే ఆలోచించుకోవాలంటూ మీడియాను ఎదురు ప్రశ్నించారు. ప్రధాని మోదీ బాగా పని చేస్తున్నారంటూనే.. రాష్ట్రంలో బీజేపీ మాత్రం ఎంత మాత్రం ఎదగకూడదనే భావనను చాలా మంది తమ మాటల ద్వారా వ్యక్తపరుస్తున్నారని... తన ఈ మాటలు ఏ ఒక్కరినో ఉద్దేశించినవి కావని పేర్కొన్నారు. మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, జనసేన విడిపోవాలని మీడియా కోరుకుంటోందని... ఓ చిన్న మాటను పట్టుకుని ఏవేవో ఊహించేస్తున్నారని.. కానీ, ఆ కోరిక ఫలించబోదని వీర్రాజు వ్యాఖ్యానించారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుంది... ఎమ్మెల్సీ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై ఇంతకుమించి తాను స్పందించబోనని అన్నారు. వైఎస్సార్సీపీ, బీజేపీ కలిసి ఉన్నాయనేది ఓ అపోహేనని చెప్పారు. తాను ప్రతి రోజూ వైఎస్సార్సీపీ, సీఎంను విమర్శిస్తూనే ఉన్నానని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజా పోరాటం చేస్తామని.. త్వరలో ఛార్జిషీటు వేయబోతున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పోరాటాలకు ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రధానితో విశాఖలో జరిపిన భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై తాము ఛార్జ్‌షీట్ వేస్తామని అన్నారు.
అమరావతిలోనే రాజధాని నిర్మాణం... రాష్ట్ర రాజధాని అమరావతేనని పునరుద్ఘాటించారు. అమరావతిలోనే రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఆ ఉద్దేశంతోనే విజయవాడలో మూడు ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు నిర్మించామన్నారు. ఇక్కడ వివిధ కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. అమరావతే రాజధాని అంటూ ఇక్కడే ఇల్లు నిర్మించుకున్నానని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని... ఇప్పుడు అమరావతిని వదిలి విశాఖకు పారిపోవాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విశాఖను జగన్ అభివృద్ధి చేసేదేంటీ..? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. విశాఖ అభివృృద్ధి కోసం రూ.200 కోట్లు కూడా జగన్ కేటాయించ లేదన్నారు. ఈ సందర్భంగా విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్ ఆకుల కిరణ్‌కుమార్ తన మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరగా.. కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉగాది సందర్భంగా వివిధ రంగాలకు చెందిన 15 మందిని సత్కరించారు.
సహజంగా ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది భారతీయ జనతా పార్టీ మీద కామెంట్స్ చేస్తున్నారు. వాటన్నింటినీ గమనిస్తే మోదీ బాగుంటాడు కానీ, ఏపీలో బీజేపీ బాగోదు అని అర్థాన్నిస్తున్నాయి. నేను ప్రత్యేకించి ఏ వ్యక్తి గురించి మాట్లాడను. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదగకూడదని ఆలోచిస్తున్నారు. రాజకీయంగా బీజేపీని అన్ పాపులర్ చేయాలనేది దృక్పథం. కొంత మంది అపోహ ఇది. నేను ప్రతి రోజు సీఎం జగన్ గురించి మాట్లాడుతూనే ఉంటాను. - సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి :