రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని భారతీయ జనతా మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ అన్నారు. మహిళల భద్రత, రక్షణ గురించి ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తున్నారే తప్ప... క్షేత్ర స్థాయిలో తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ తొలి సమావేశంలో వనతి శ్రీనివాసన్, జాతీయ ప్రధాన కార్యదర్శి సుప్రీత్ కౌర్ పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా భాజపా రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు.
కార్యకర్తలతో కమిటీలు...
మహిళలకు ఉపాధి, ఆర్థిక స్వావలంబన, మహిళల పట్ల వివక్ష, కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం కొన్ని తీర్మానాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోనూ కనీసం పది మంది మహిళా కార్యకర్తలతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజకీయ, సాంఘిక, సామాజిక సమస్యలపై మహిళా మోర్చా ఓ బలమైన శక్తిగా ముందుండి పోరాటాలు సాగించాలని వనతి శ్రీనివాసన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో దిశ యాప్ ప్రారంభించినా మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆక్షేపించారు.
హామీని నెరవేర్చండి...
రాష్ట్రంలో నమోదవుతున్న క్రిమినల్ కేసుల్లో ఎక్కువ భాగం అధికార పార్టీ నేతల ప్రమేయంతో జరుగుతున్నవేనని వనతి శ్రీనివాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు ప్రభుత్వం అండగా నిలిచి వారిని రక్షిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్, కమిషన్ పనితీరు సంతృప్తికరంగా లేదని వ్యాఖ్యానించారు. పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చిన మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం అధిక పన్నులు వసూలు చేయడంతో రాష్ట్రంలో పెట్రో ధరలు పెరిగిపోయాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
farmers problems: వర్షాలకు మొలకెత్తుతున్న వేరుశెనగ..ఆందోళనలో అన్నదాతలు