రాష్ట్ర అభివృద్ధికి వేల కోట్ల రూపాయాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే.. జగన్ సర్కార్ ఆ నిధులను పక్కదారి పట్టిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం కేవలం అప్పులు మాత్రమే చేస్తుందని ఆరోపించారు. కృష్ణా జిల్లా పామర్రులో జరిగిన మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ భాజపా శక్తి కేంద్ర సభ్యుల సమావేశంలో సోమువీర్రాజు పాల్గొన్నారు.
కేంద్రం అమలు చేసే ప్రతి పథకానికి ముఖ్యమంత్రి తన ఫొటోలు వేసుకుంటున్నాడని.. స్కూలు పిల్లల బ్యాగులతోపాటు, చెడ్డీలకు కూడా ముఖ్యమంత్రి ఫొటోలు వేసుకుంటే బాగుంటుందని వీర్రాజు ఎద్దేవా చేశారు. బంగారం కూడా అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలో పక్కనే నదులు ఉన్నా.. ఇసుక అందుబాటులో లేకపోవడం సిగ్గుచేటని సోము వీర్రాజు విరమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను తనవిగా చెప్పుకుంటున్న వైకాపా ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని.. రాజధాని లేకుండాపాలన చేస్తున్న సీఎం జగన్కు గుణపాఠం చెప్పాలని ప్రజలకు సోమువీర్రాజు సూచించారు. ఈ సమావేశంలో పలువురు భాజపా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: