విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కృష్ణా జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పెనుగంచిప్రోలులో వైకాపా, కమ్యూనిస్టు పార్టీల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. దుకాణాలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూసివేశారు.
హనుమాన్ జంక్షన్లో..
హనుమాన్ జంక్షన్లో విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా.. తెదేపా ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆందోళన చేపట్టారు.
కార్మిక సంఘాల ర్యాలీ
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విజయవాడలో కార్మిక సంఘాలు చేపట్టిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అఖిలపక్షాన్ని ప్రధాని మోదీ వద్దకు తీసుకు వెళ్లాలని అన్నారు.
రామవరప్పాడు గ్రామంలో బంద్
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో.. వైకాపా పిలుపుమేరకు రామవరప్పాడు గ్రామంలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
మూతపడ్డ వ్యాపార, వాణిజ్య సంస్థలు
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి,చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో.. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు.
నిరసన ప్రదర్శనలు
మైలవరం పట్టణంలో.. అన్ని వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆర్టీసీ బస్సులు సైతం డిపోలకే పరిమితం అయ్యాయి. సీపీఎం, తెదేపా నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నూజివీడులో..
నూజివీడులో బంద్ పాక్షికంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కానున్నారు. నూజివీడు బస్టాండ్ ప్రాంగణం.. ప్రయాణికులు లేక వెలవెలబోతోంది.
ఇదీ చదవండి: ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్.. నిలిచిన రవాణా వ్యవస్థ