కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్ సోకిందని తెలియక ప్రాణాల మీదకి తెచ్చుకుని మరణాలు సంభవించాయి. కోడూరు మండలం స్వతంత్రపురం, మందపాకల గ్రామలలోని ప్రాథమిక కేంద్రాలను అవనిగడ్డ శాసన సభ్యులు సింహాద్రి రమేశ్ బాబు పరిశీలించారు. మహమ్మారి పై తగు జాగ్రత్తలు సూచించారు.
ఒక వ్యక్తి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయేమోనని భయభ్రాంతులతో వైద్య పరీక్షలకు వస్తే.. 'ఇక్కడ కరోనా పరీక్ష కిట్లు లేవు అవనిగడ్డ వెళ్లమనడం మీకు భావ్యమా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి పీహెచ్సీలో కరోనా కిట్లు ఉన్నాయా? లేవా? అని వైద్యులను ప్రశ్నించగా... 40 పరీక్ష కిట్లు ఉన్నాయని, వైద్య పరీక్షలకు ఎవరూ వచ్చినా చికిత్సలు అందిస్తామని తెలిపారు.
కుక్క కాటు, పాము కాటు మొదలగు వైద్యసేవలు, వ్యాధులకు మండలం నుంచి ఏ వ్యక్తి వైద్యానికి వచ్చినా వారికి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత మీదేనని పునరుద్ఘాటించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కరోనా అనుమానంతో ఏ వ్యక్తి వచ్చినా వారికి వెంటనే టెస్ట్లు చేయాలని వైద్యులకు సూచించారు. దివి మార్కెట్ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు, అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.భీమేశ్వర్ రవికుమార్, కోడూరు ఎస్.ఐ రమేశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.